Share News

ఏడుగురిని బలిగొన్న విష వాయువు

ABN , Publish Date - Jun 22 , 2026 | 03:59 AM

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలూకా కన్నిగైపేర్‌ ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీలో ఆదివారం ఉదయం అమ్మోనియా గ్యాస్‌ లీకై ఏడుగురు కార్మికులు మృతి చెందారు.

ఏడుగురిని బలిగొన్న విష వాయువు

  • రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీలో అమ్మోనియా లీక్‌.. తీవ్ర అస్వస్థతకు గురైన సుమారు 60 మంది

  • చికిత్స పొందుతూ ఏడుగురు కార్మికులు మృతి.. తిరువళ్లూరు జిల్లాలో ఘటన

చెన్నై, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలూకా కన్నిగైపేర్‌ ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీలో ఆదివారం ఉదయం అమ్మోనియా గ్యాస్‌ లీకై ఏడుగురు కార్మికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురై ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నటుజ్డి అధికారులు తెలిపారు. కన్నిగైపేర్‌ ప్రాంతంలో ‘సెయింట్‌ పీటర్‌ అండ్‌ పాల్‌ సీ ఫుడ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీని నడుపుతున్నారు. ఆ కంపెనీలో ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో 200 మందికి పైగా కార్మికులు పనిచేస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది అసోం, ఒడిసా, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సుమారు 120 మంది విధులకు హాజరయ్యారు. ఆ సమయంలో రొయ్యలు నిల్వ చేసే విభాగం నుంచి అమ్మోనియా వాయువు వెలువడింది. దానిని పీల్చిన సుమారు 60 మంది ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కంపెనీ నిర్వాహకులు అస్వస్థతకు గురైన వారిని వెంటనే మంజకరణై ప్రాంతంలో ఉన్న వేల్స్‌ హాస్పిటల్‌, వెంకటేశ్వర హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో వేల్స్‌ హాస్పిటల్‌లో అత్యవసర చికిత్స విభాగంలో చికిత్స పొందుతూ ఆరుగురు, వెంకటేశ్వర హాస్పిటల్‌లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమంగా ఉన్నవారిని చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి, రాజీవ్‌గాంధీ స్మారక సర్వజన ఆసుపత్రి (జీహెచ్‌)కి తరలించారు. రాజీవ్‌గాంధీ స్మారక సర్వజన ఆసుపత్రిలో 9 మంది మహిళా కార్మికులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో సుమారు పది మంది ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. కాగా.. రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీ యజమాని మోహన్‌, ఆయన సోదరుడు జోసెఫ్‌ను పెరియపాళయం పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. ఆ కంపెనీ నుంచి రోజూ రాత్రి పూట విషవాయువులు వెలువడుతున్నాయని, ఈ విషయమై ప్రభుత్వ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కన్నిగైపేర్‌ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.


రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌

రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీలో అమ్మోనియా గ్యాస్‌ లీకైన సమాచారం తెలియగానే అరక్కోణం నుంచి జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్‌ లీకైన ప్రాంతాన్ని పరిశీలించి, లీకేజి నియంత్రణ చర్యలు చేపట్టారు. కార్మికుల మరణంపై తమిళనాడు గవర్నర్‌ ఆర్వీ ఆర్లేకర్‌, సీఎం విజయ్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి విజయ్‌ కార్మిక భద్రత శాఖ, ఆరోగ్య శాఖ, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులతో వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్వు జారీ చేశారు. ఈ త్రిసభ్య కమిటీ విచారణ జరిపి 24 గంటల్లోపు ప్రభుత్వానికి మధ్యంత నివేదిక సమర్పించాలని, మూడు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అమ్మోనియా లీక్‌ ఘటనపై సీఎం విజయ్‌ ఆదేశా మేరకు సమగ్ర విచారణ జరుపనున్నట్టు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పర్వేజ్‌ ప్రకటించారు. ఆ మేరకు చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి (జీహెచ్‌) డీన్‌ శాంతారామ్‌ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ విచారణ జరిపి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. గ్యాస్‌ లీక్‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

Updated Date - Jun 22 , 2026 | 03:59 AM