ఇక దేశవ్యాప్తంగా నార్కోటిక్స్ దాడులు
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:53 AM
దేశంలో ఇప్పటి వరకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థల ద్వారా అక్రమ సంపాదనాపరులపై, నేరచరితులపై దృష్టి సారించిన కేంద్రం ...
రాజకీయ నేతలు, సినీ పరిశ్రమకు చెందిన వారిపైనే ఎక్కువ!
న్యూఢిల్లీ, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఇప్పటి వరకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థల ద్వారా అక్రమ సంపాదనాపరులపై, నేరచరితులపై దృష్టి సారించిన కేంద్రం ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డును కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే బోర్డు డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్‌తో విస్తృత చర్చలు జరిపారు. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోయినందువల్ల యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. నక్సలిజాన్ని అంతం చేయడంపై అమిత్ షా విజయం సాధించారని, అదే విధంగా మాదక ద్రవ్యాల నిరోధానికి కూడా చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ తరుణంలో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన వారిపై త్వరలో పెద్ద ఎత్తున దాడులు జరిగే అవకాశాలున్నాయని ఈ వర్గాలు వెల్లడించాయి. త్వరలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో నార్కోటిక్స్ బోర్డు దాడులు జరుగుతాయని, కీలకాంశాలు వెల్లడవుతాయని తెలిపాయి.