Share News

కేంద్రపాలిత ప్రాంతాల పటిష్ఠతే మోదీ లక్ష్యం

ABN , Publish Date - Aug 10 , 2026 | 05:03 AM

కేంద్రపాలిత ప్రాంతాలను బలోపేతం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని, పుదుచ్చేరి సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.

కేంద్రపాలిత ప్రాంతాల పటిష్ఠతే మోదీ లక్ష్యం

  • పుదుచ్చేరి సమగ్రాభివృద్ధికి అండగా ఉంటాం: అమిత్‌ షా

పుదుచ్చేరి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత ప్రాంతాలను బలోపేతం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని, పుదుచ్చేరి సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ పుదుచ్చేరి పోలీసులు అంతర్గత భద్రత, శాంతిభద్రతలను కాపాడడంలో అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. పుదుచ్చేరి పోలీసు విభాగానికి దక్కిన ప్రతిష్ఠాత్మక ‘ప్రెసిడెంట్స్‌ కలర్‌’ పతాకం అందజేత వేడుకను గోరిమేడులోని పోలీసుశాఖ మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్‌ షా.. పుదుచ్చేరి పోలీసులకు రాష్ట్రపతి పతాకాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ... పుదుచ్చేరిలో రూ.2,500 కోట్లతో రహదారుల విస్తరణ ప్రాజెక్టు, రూ.2,200 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ సహా విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు చెప్పారు. గత 9 ఏళ్లలో రూ.39 వేల కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.

Updated Date - Aug 10 , 2026 | 05:05 AM