Share News

రాహుల్‌.. మీరెప్పటికీ ప్రధాని కాలేరు!

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:25 AM

ఇప్పుడాయన కుమారుడు సిక్కుల గాయాలను రేపేలా ఇవాళ ర్యాలీ నిర్వహించారు. నాడు దమనకాండకు పాల్పడినవారిపై కేసులను మోదీ ప్రభుత్వం వచ్చాక తిరిగి తెరిచింది. బాధితులకు తలో రూ.5 లక్షల సాయం చేసింది. దమనకాండను ప్రేరేపించిన కాంగ్రెస్‌ నేతలను జైలుకు పంపేలా చేసింది’ అని దుయ్యబట్టారు. అసత్య ప్రచారంతో, అరాచకాలు సృష్టిస్తూ.. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకున్నాయని విమర్శించారు. దమ్ముంటే ఓట్ల చోరీపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలని సవాల్‌ విసిరారు.

రాహుల్‌.. మీరెప్పటికీ ప్రధాని కాలేరు!

  • జీవితాంతం మాక్‌ పార్లమెంటులోనే!!

  • ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై అమిత్‌ షా ధ్వజం

  • విదేశీ శక్తుల ఆదేశాలతోనే ఇండి కూటమి ర్యాలీ

  • ఓట్ల చోరీపై ప్రత్యేక సమావేశాల్లో చర్చించండి

  • విపక్ష నేతలకు కేంద్ర హోం మంత్రి సవాల్‌

  • ఢిల్లీ, రోహతక్‌, సిమ్లాలో బీజేపీ పోటాపోటీ ర్యాలీలు

న్యూఢిల్లీ, నవంబరు 1: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ఆయన జీవితాంతం మాక్‌ పార్లమెంటులోనే ఉంటారని ఎద్దేవాచేశారు. 1984లో ఇదే రోజు సిక్కులపై దమనకాండ జరిగిందని.. దానిని విస్మరించి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఢిల్లీలో ఇండి కూటమి ర్యాలీ చేపట్టడంపై మండిపడ్డారు. రాంలీలా మైదాన్‌లో విపక్షాల ర్యాలీకి పోటీగా ఢిల్లీ, రోహతక్‌, సిమ్లా సహా పలు చోట్ల బీజేపీ భారీ ర్యాలీలు నిర్వహించింది. ఆదివారం చండీగఢ్‌ పోలీసు శాఖ 60వ వ్యవస్థాపక దినోత్సవ సభలో అమిత్‌షా ప్రసంగించారు. విదేశీ శక్తుల ఆదేశాలతోనే రాహుల్‌ రామ్‌లీలా మైదాన్‌ ర్యాలీ చేపట్టారని ఆరోపించారు. గత మూడు దఫాలుగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడుతూ వచ్చిందన్నారు. తన కుమారుడిని ప్రధానిగా చూడాలన్న సోనియాగాంధీ కల కలగానే మిగిలిపోయిందని చెప్పారు. ‘దీంతో ఆమె ‘మాక్‌ పార్లమెంటు’ అనే కొత్త ఆలోచనతో వచ్చారు. రాహుల్‌కు ఓ విషయం చెప్పదలిచాను. మీరు ప్రధాని అవ్వాలనుకుంటే మాక్‌ పార్లమెంటులోనే జీవితాంతం ఉండండి. ఎందుకంటే మీరెప్పటికీ ప్రధాని కాలేరు. 1984లో సరిగ్గా ఇదే రోజున కాంగ్రెప్‌ ప్రోద్బలంతో వేల మంది సిక్కులను క్రూరంగా హత్య చేశారు. వేల మందిని సజీవ దహనం చేశారు. చాలా మంది సిక్కులు భయపడి పారిపోయారు. భారీ వృక్షం కూలినప్పుడు భూమి కంపిస్తుందని నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన వ్యాఖ్యను ఎప్పటికీ మరువలేను.


ఇప్పుడాయన కుమారుడు సిక్కుల గాయాలను రేపేలా ఇవాళ ర్యాలీ నిర్వహించారు. నాడు దమనకాండకు పాల్పడినవారిపై కేసులను మోదీ ప్రభుత్వం వచ్చాక తిరిగి తెరిచింది. బాధితులకు తలో రూ.5 లక్షల సాయం చేసింది. దమనకాండను ప్రేరేపించిన కాంగ్రెస్‌ నేతలను జైలుకు పంపేలా చేసింది’ అని దుయ్యబట్టారు. అసత్య ప్రచారంతో, అరాచకాలు సృష్టిస్తూ.. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకున్నాయని విమర్శించారు. దమ్ముంటే ఓట్ల చోరీపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలని సవాల్‌ విసిరారు.


మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే: నడ్డా

మోదీ ప్రభుత్వాన్ని కూల్చాలన్న దురుద్దేశంతోనే.. సిక్కుల అణచివేత జరిగిన రోజున కాంగ్రెస్‌ ఢిల్లీలో ర్యాలీ చేపట్టిందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. ఇదో పిచ్చి నాటకమని.. కాంగ్రెస్‌ రాజకీయ భవిష్యత్‌కు ఇక తెరపడినట్లేనని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో స్పష్టంచేశారు. విపక్షాల నిరసన ర్యాలీ.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని తొలగించి.. భారత ప్రజాస్వామ్యాన్ని అరాచకం, గందరగోళంలోకి నెట్టేందుకు పకడ్బందీగా పన్నిన కుట్రేనని స్పష్టంచేశారు. పండుగల సీజన్‌లో లక్షలాది మంది దుకాణదారులు, వ్యాపారుల ఆదాయాన్ని దెబ్బతీయడం.. దేశాన్ని అప్రతిష్ఠ పాల్జేయడమే దీని లక్ష్యాలని చెప్పారు. నవంబరు 1 భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మాయనిమచ్చగా నిలిచిందన్నారు. సిక్కుల పట్ల చేసిన మహాపాపానికి గాంధీ కుటుంబం ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని.. వేల మంది సోదరీమణులు పసుపు కుంకుమలు పోగొట్టుకున్నారని.. ఢిల్లీలో ఉన్న ‘విడో కాలనీ’ కాంగ్రెస్‌ రక్తచరిత్రకు తార్కాణంగా నిలుస్తోందని తెలిపారు. ఇదివరకు జరిగిన నిరసనల కారణంగా చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు రూ.3 వేల కోట్లు నష్టపోయారని.. తాజా ఆందోళనలతో ధనత్రయోదశి, దీపావళి, ఛఠ్‌పూజ పండుగల వేళ మరో పది వేల కోట్లు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. అయినా రాహుల్‌గాంధీకి ఇవేమీ పట్టవని, వ్యాపార, వాణిజ్య సంఘాల వినతిపత్రాలను, లేఖలను ఆయన లక్ష్యపెట్టలేదని ఆక్షేపించారు. విదేశాలకు వెళ్లి భారత్‌ను అవమానిస్తారని.. తిరిగొచ్చాక దేశ ప్రజాస్వామ్యం, ఎకానమీపై దాడి చేస్తారని దుయ్యబట్టారు.


పశ్చిమ ఢిల్లీలో బీజేపీ భారీ ప్రదర్శన..

సిక్కులపై దమనకాండను వ్యతిరేకిస్తూ.. బీజేపీ ఆదివారం పశ్చిమ ఢిల్లీలోని హరినగర్‌ నుంచి తిలక్‌నగర్‌ వరకు భారీ పాదయాత్ర నిర్వహించింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీ్‌పసింగ్‌ పురీ దీనికి నాయకత్వం వహించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హర్ష్‌ మల్హోత్రా, ఢిల్లీ మంత్రి మంజీందర్‌సింగ్‌ సిర్సా, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హెచ్‌ఎస్‌ ఫూల్కా ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్‌, రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరియాణాలోని రోహతక్‌లో జరిపిన ర్యాలీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ హాజరయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో జరిగిన పాదయాత్రలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 02:27 AM