Share News

మహిళా బిల్లును ఓడించి సంబరాలా?

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:14 AM

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఓడించిన కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా బిల్లును ఓడించి సంబరాలా?

  • ఊహించడానికే ఇబ్బందికరంగా ఉంది

  • విపక్షాల ఆలోచన దేశానికి మేలు చేయదు

  • బిల్లు ఓటమిపై హోంమంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఓడించిన కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీల ఆలోచనా ధోరణి మహిళా ప్రయోజనాలకు కానీ, దేశ ప్రయోజనాలకు మేలు చేసేవి కాదని అన్నారు. మహిళలకు 33 శాతం కోటా ఇచ్చే బిల్లును ఓడించి సంబరాలు చేసుకోవడం, దానిపై విజయోత్సవ నినాదాలు చేయడం అత్యంత గర్హనీయమని, ఊహించడానికే ఇబ్బందికరమైన విషయమని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో బిల్లు వీగిపోయిన తర్వాత ఆయన ట్విటర్‌ ద్వారా స్పందించారు. కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి అత్యంత కీలకమైన నారీశక్తి వందన్‌ అధినియమ్‌ బిల్లును నెగ్గకుండా అడ్డుకున్నాయని చెప్పారు. ఈ దేశ మహిళలు తమ హక్కయిన 33 శాతం రిజర్వేషన్‌ను లోక్‌సభలో, రాష్ట్రాల విధానసభల్లో అందుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు మహిళా బిల్లుకు గండి కొట్టడం ఇదే మొదటిసారి కాదని చెప్పారు. కాంగ్రెస్‌ ఇతర పార్టీలు మహిళా శక్తికి చేసిన ఈ అవమానం చాలాదూరం వెళ్తుందని, విపక్షం మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలే కాదు, అన్ని స్థాయిల్లో ప్రతీ ఎన్నికల్లో ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

చెల్లిను చూసి మాట్లాడటం నేర్చుకో

అంతకుముందు సభలో బిల్లులో చర్చ సందర్భంగా అమిత్‌షా రాహుల్‌గాంధీ మీద విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా దేశ గౌరవాన్ని పెంచాల్సింది పోయి దెబ్బ తీస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘మీరు పిరికివారు. మీరు లొంగిపోతున్నారు. నన్నుచూసి భయపడుతున్నారు.... ఇవేం మాటలు? ప్రతిపక్ష నేత ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? సభాగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకుంది. దేశం మిమ్మల్ని గమనిస్తోంది. మీ మాటను బట్టే మీ పార్టీని ప్రజలు అంచనా వేస్తారు’’ అన్నారు. రాహుల్‌గాంధీ వ్యవస్థలను తూలనాడుతూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అమిత్‌షా వ్యాఖ్యానించారు. సీనియర్ల నుంచి మాటతీరు నేర్చుకోవాలని సూచించారు. సీనియర్లు ఎవరూ లేరనుకుంటే ప్రియాంక తీరు సీనియర్‌ లాగా చక్కగా ఉందని, ఆమెను చూసి నేర్చుకోవాలని అన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 05:14 AM