చొరబాటుదారులు రాకుండా అడ్డుకుంటాం!
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:40 AM
అస్సాంలో బీజేపీని తిరిగి గెలిపిస్తే.. చొరబాటుదారులు రాకుండా అడ్డుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు.
నాలుగు పెళ్లిళ్లు చేసుకోకుండా నిషేధం విధిస్తాం
అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం: అమిత్ షా
దుద్‌నోయ్, ఏప్రిల్ 3: అస్సాంలో బీజేపీని తిరిగి గెలిపిస్తే.. చొరబాటుదారులు రాకుండా అడ్డుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. చొరబాటుదారులు వివాహ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని, నాలుగేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారని.. దీనిపై నిషేధం విధిస్తామని, రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని చెప్పారు. అయితే, ఈ ఉమ్మడి పౌర స్మృతిని గిరిజన ప్రాంతాలను వర్తింపజేయబోమని, ఈ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అమిత్‌షా పేర్కొన్నారు.ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో శుక్రవారం బీజేపీ నిర్వహించిన ఎన్నికల సభల్లో అమిత్‌షా ప్రసంగించారు. ఇటీవల పొరుగురాష్ట్రమైన మేఘాలయలోని గరావ్ హిల్స్‌లో చోటు చేసుకున్న హింసాకాండ గురించి ప్రస్తావిస్తూ.. గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకొని గరావ్ కౌన్సిల్‌లో అధికారం హస్తగతం చేసుకోవాలని చొరబాటుదారులు భావించారని, దీనివల్లే వివాదం తలెత్తిందని అమిత్‌షా తెలిపారు. అస్సాంను చొరబాటుదారుల కేంద్రంగా తయారుచేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆ చొరబాటుదారులందరినీ బీజేపీ ప్రభుత్వం వెనక్కి పంపుతోందని, మరోసారి అధికారం ఇస్తే.. చొరబాటుదారులు లేకుండా చేస్తామన్నారు. మోదీ పాలనలో గత 11 ఏళ్లలో గిరిజన సంక్షేమానికి రూ.1.38లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రతీ గిరిజన కుటుంబానికి ఒక ఆవు, ఒక బర్రె ఇస్తామని హామీ ఇచ్చారు.