అక్రమ వలసలకు చెక్
ABN , Publish Date - May 27 , 2026 | 04:17 AM
దేశంలోకి నానాటికీ పెరుగుతున్న అక్రమ వలసలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అక్రమ వలసలు, చొరబాట్లు, ఇతర అసాధారణ కారణాలతో దేశంలో జరుగుతున్న...
అసహజ జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ
సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు
ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ, మే 26: దేశంలోకి నానాటికీ పెరుగుతున్న అక్రమ వలసలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అక్రమ వలసలు, చొరబాట్లు, ఇతర అసాధారణ కారణాలతో దేశంలో జరుగుతున్న అసహజ జనాభా మార్పులపై అధ్యయనానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ఈ సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, గిరిజన సమాజాల పరిరక్షణకు పెనుసవాలుగా ఆయన అభివర్ణించారు. ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ వాగ్దానం చేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహించే కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి, జనగణన కమిషనర్ సభ్యులుగా ఉంటారని, హోంశాఖ సంయుక్త కార్యదర్శి (విదేశీయులు-1)సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని ‘ఎక్స్’లో చేసిన పోస్టులో షా పేర్కొన్నారు. అక్రమ వలసలు, సరిహద్దుల్లో చొరబాట్లు, ఇతర అసాధారణ కారణాలతో దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మార్పులతో పాటు మత, సామాజికవర్గాల వారీగా అసాధారణ జనాభా మార్పుల సరళిని ఈ కమిటీ సమగ్రంగా విశ్లేషిస్తుందని తెలిపారు. ఈ సమస్యలకు అర్థవంతమైన, విధానపరమైన, కాలపరిమితితో కూడిన పరిష్కారాలను ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందని అమిత్ షా తెలిపారు.