Share News

అనుకూల తీర్పు రావాలంటే..హైకోర్టు జడ్జికి 50 లక్షలు ఇవ్వాలి..!

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:35 AM

తమకు అనుకూలంగా తీర్పు వెలువరించేందుకు మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాలని ఓ సీనియర్‌ న్యాయవాది.. పిటిషనర్‌ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడంటూ కేంద్ర న్యాయశాఖకు అందిన....

అనుకూల తీర్పు రావాలంటే..హైకోర్టు జడ్జికి 50 లక్షలు ఇవ్వాలి..!

  • పిటిషనర్‌ నుంచి తీసుకున్నారని న్యాయవాదిపై ఆరోపణ

  • కేంద్ర న్యాయశాఖకు అందిన ఫిర్యాదుతో కలకలం

చెన్నై, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): తమకు అనుకూలంగా తీర్పు వెలువరించేందుకు మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాలని ఓ సీనియర్‌ న్యాయవాది.. పిటిషనర్‌ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడంటూ కేంద్ర న్యాయశాఖకు అందిన ఫిర్యాదు న్యాయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ మద్రాసు హైకోర్టుకు పంపగా... దీన్ని సదరు న్యాయవాది తీవ్రంగా ఖండించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని ప్రకటించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సదరు కేసు విచారణ నుంచి తప్పుకొన్న న్యాయమూర్తి.. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలిలా వున్నాయి... 2008-09లో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పాల్గొంటూ ఇండియన్‌ మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ను రూ.113.38 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్‌ ప్రసాద్‌ అగర్వాల్‌, గణేశ్‌ అగర్వాల్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. వివిధ పరిణామాల అనంతరం ఈ వ్యవహారంపై విచారణ... మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.నిర్మల్‌కుమార్‌ ముందుకు వచ్చింది. ఈ కేసులో అనుకూలమైన తీర్పు రావాలంటే న్యాయమూర్తికి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ పిటిషనర్ల నుంచి సీనియర్‌ న్యాయవాది మురళీకుమరన్‌ తీసుకున్నారని ‘ఆలిండియా లాయర్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ జస్టిస్‌’ నుంచి కేంద్ర న్యాయశాఖకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యవహారం న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. దీనిపై న్యాయమూర్తి సీనియర్‌ న్యాయవాది మురళీకుమరన్‌ను ప్రశ్నించగా.. ఆయన ఈ ఆరోపణలు ఖండించారు. ఈ వ్యవహారంలో తాను ఎలాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా సిద్ధమని ప్రకటించారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.శ్రీనివాసన్‌ స్పందిస్తూ.. న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయవ్యవస్థ గౌరవానికిభంగం కలిగించే అలాంటి లేఖను తిరస్కరించాలని అభ్యర్థించారు.జస్టిస్‌ నిర్మల్‌కుమార్‌ స్పందిస్తూ ఈ వ్యవహారంలో పిటిషనర్‌ నుంచి న్యాయవాది నగదు తీసుకున్నారో లేదో తేల్చేందుకు విచారణ చేపట్టాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అంతేగాక ఈ పిటిషన్‌పై విచారణను మరో బెంచ్‌కి బదిలీ చేసేందుకు అనువుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని ఆదేశించారు.

Updated Date - Feb 16 , 2026 | 06:10 AM