ఎన్నికల్లో పోటీకి వీలు కల్పిస్తూ హత్య కేసులో దోషికి శిక్ష నిలిపివేత
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:19 AM
హత్య కేసులో జీవితఖైదు పడిన వ్యక్తి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఆ కారణంగా ఆయన శిక్షను, దోషిత్వ నిర్ధారణను అలహాబాద్ హైకోర్టు నిలిపివేసింది.
అలహాబాద్ హైకోర్టు సంచలన నిర్ణయం.. గతంలో ప్రజాప్రతినిధులకూ స్టే ఇచ్చారని ప్రస్తావన
సామాన్యుడికీ ఆ హక్కు ఉందని స్పష్టీకరణ
ప్రయాగరాజ్, అక్టోబరు 19: హత్య కేసులో జీవితఖైదు పడిన వ్యక్తి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఆ కారణంగా ఆయన శిక్షను, దోషిత్వ నిర్ధారణను అలహాబాద్ హైకోర్టు నిలిపివేసింది. 2027లో జరిగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కానీ, వీలైతే బీజేపీ టికెట్‌పై గానీ పోటీ చే యాలని అనుకుంటున్నట్లు దోషి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జస్టిస్ సిద్ధార్థ్, జస్టిస్ వినయ్ కుమార్ ద్వివేదీ ధర్మాసనం ఈ నెల 5న ఉత్తర్వులు ఇచ్చింది. అప్పీలు పెండింగ్‌లో ఉన్నంత కాలం దోషిత్వ నిర్ధారణ, శిక్ష నిలిచిపోతాయని స్పష్టం చేస్తూ దోషికి బెయిల్ మంజూరు చేసింది.
వారణాసి కోర్టు తీర్పు
నందలాల్ రాయ్ అలియాస్ బబ్లూ రాయ్‌ను ఒక హత్య కేసులో దోషిగా నిర్ధారిస్తూ వారణాసి కోర్టు 2025 ఏప్రిల్‌లో జీవిత ఖైదు విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. అప్పీలు విచారణ పూర్తయ్యే వరకు తనను విడుదల చేయాలని కోరుతూ బెయిలు దరఖాస్తు పెట్టుకున్నారు. మీడియా కథనాల ప్రకారం, రామజన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పని చేసిన ప్రమోద్ కుమార్ నిగమ్ హత్య కేసులో దోషులుగా తేలిన వారిలో రాయ్ ఒకరు. గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా మారిన ముఖ్తార్ అన్సారీతో బబ్లూ రాయ్‌కు సంబంధాలు ఉన్నాయని కథనాలు పేర్కొన్నాయి.
బీజేపీ కార్యకర్తను..
రాయ్ తరఫున న్యాయవాదులు వాది స్తూ, దోషిగా తేలకముందు ఆయన బీజేపీలో క్రియాశీల కార్యకర్తగా ఉండేవారని కోర్టుకు చెప్పారు. హతుడు రాజకీయంగా చురుకైన వ్యక్తి కావడంతో అనుమానం, ఊహాగానాల ఆధారంగా రాయ్‌ను కేసులో ఇరికించారని వాదించారు. ప్రాసిక్యూషన్ కేసు చాలావరకు సందర్భ సాక్ష్యాలపైనే ఆధారపడి ఉందని చెప్పారు. దర్యాప్తులో రాయ్ పేరు ఆలస్యంగా బయటకు రావడం, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు అనుమానాస్పందంగా ఉండటం, హత్యాయుధం స్వాధీనం చేసుకున్న విధానంపై సందేహాలు ఉండటాన్ని ప్రస్తావించారు.
ధర్మాసనం ఏమంది?
ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల ప్రజలపట్ల ప్రత్యేక బాధ్యతలు కలిగి ఉంటారని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొందని ధర్మాసనం గుర్తుచేసింది. ఆ కారణంగానే పలువురు ప్రజాప్రతినిధుల దోషిత్వ నిర్ధారణను సుప్రీంకోర్టు నిలిపేసిందని తెలిపింది. దోషిత్వ నిర్థారణపై స్టే లభించకపోతే ఎన్నికల్లో పోటీచేసే అవకా శం కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంది. అదే సమయంలో సామాన్యుడి జీవనోపాధి హక్కు కూడా ఒక రాజకీయ నాయకుడి ఎ న్నికల్లో పోటీచేసే హక్కు కన్నా తక్కువేమీ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అప్పీలుపై తుదితీర్పు వచ్చేవరకు దోషి మ నుగడ సాగించగలిగేలా దోషిత్వ నిర్థారణ ను, శిక్షను నిలిపివేయడం సముచితమని అభిప్రాయపడింది. ‘మొత్తం వాస్తవాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే అప్పీ లు పెండింగులో ఉన్నకాలంలో అప్పీలుదారుకు విధించిన దోషిత్వ నిర్ధారణ, శిక్షలను నిలిపివేయాల్సిందే’ అని ఉత్తర్వులో పేర్కొంది.
పోటీకి మార్గం సుగమం?
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) ప్రకారం, ఏదైనా నేరంలో దోషిగా తేలి రెండేళ్లు లేదా అంతకు మించి శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఈ అనర్హత నుంచి బయట పడాలి అంటే శిక్ష అమలు నిలిపివేత మాత్రమే సరిపోదు. దోషిత్వ నిర్ధారణ కూడా నిలిచిపోవాలి. హైకోర్టు తాజా ఉత్తర్వులతో రాయ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సాంకేతిక అడ్డంకి తొలగినట్లయింది. అయితే, హత్య కేసులో దోషి.. తాను కేవలం పోటీ చేయాలి అనుకుంటున్నానని చెప్పారు.