పరస్పర అంగీకారంతో సహజీవనం నేరం కాదు!
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:54 AM
సహజీవనానికి సంబంధించి అలాహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహమైన పురుషుడు మరో మహిళతో, ఆమె సమ్మతితో....
పెళ్లయిన పురుషుడు, మరో మహిళ సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, మార్చి 27: సహజీవనానికి సంబంధించి అలాహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహమైన పురుషుడు మరో మహిళతో, ఆమె సమ్మతితో సహజీవనం చేస్తే అది నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. నైతికత, చట్టం వేర్వేరు అంశాలని... పౌరుల హక్కుల పరిరక్షణ విషయంలో న్యాయస్థానాల విధులను ‘సమాజ నైతికత’ నిర్దేశింపజాలదని కోర్టు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా.. అప్పటికే పెళ్లయిన ఓ వ్యక్తి, మరో మహిళతో సహజీవనం చేయడాన్ని నేరంగా పరిగణించాలంటూ సదరు మహిళ కుటుంబీకులు వాదించారు. దీన్ని కోర్టు తోసిపుచ్చింది. యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన సహజీవనం చేస్తున్న జంటపై ఆ మహిళ కుటుంబీకులు పోలీసు కేసు పెట్టారు. ఈ కేసు కొట్టేయాలంటూ సహజీవనం చేస్తున్న జంట అలాహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అలాగే సహజీవనాన్ని వ్యతిరేకిస్తున్న సదరు మహిళ కుటుంబీకులు తమను హత్యచేస్తామని బెదిరించారని, తమను కులోన్మాదంతో చంపేస్తారేమోనంటూ పిటిషన్‌లో ఆ జంట భయాందోళనలు వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. సదరు మహిళ తాను మేజర్‌ను అని, తన ఇష్టపూర్వకంగానే సహజీవనం చేస్తున్నట్లు వాంగ్మూలం ఇచ్చిందని గుర్తుచేసింది. పరస్పర సమ్మతితో సహజీవనం చేస్తున్న ఆ జంటకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.