పెళ్లయిన ఏడేళ్లలోపు వేధింపులతో మహిళ మరణిస్తే అది వరకట్నం చావే
ABN , Publish Date - Aug 10 , 2026 | 05:13 AM
కట్నం కోసం వేధించడం కారణంగా వివాహమైన ఏడేళ్లలోపు మహిళ మరణిస్తే దానిని వరకట్నం చావుగానే పరిగణించాల్సి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్ పేర్కొంది.
ఇందుకు ఆధారాలు చాలు: అలహాబాద్ హైకోర్టు తీర్పు
లఖ్‌నవూ, ఆగస్టు 9: కట్నం కోసం వేధించడం కారణంగా వివాహమైన ఏడేళ్లలోపు మహిళ మరణిస్తే దానిని వరకట్నం చావుగానే పరిగణించాల్సి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్ పేర్కొంది. వరకట్నం కోసం వేధించినట్టు ఆధారాలు ఉంటే చాలని, ప్రత్యక్ష సాక్ష్యాలు అవసరం లేదని తెలిపింది. వరకట్నం హత్య కేసులో యావజ్జీవ కారాగారం అనుభవిస్తున్న సందీప్ సింగ్ హోరా (40)కు శిక్షను పదేళ్లకు తగ్గిస్తూ జస్టిస్ అబ్దుల్ మోయిన్, జస్టిస్ ప్రమోద్ కుమార్ శ్రీవాత్సవ్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. ప్రస్తుత కేసులో వరకట్నం వేధింపుల కారణంగా ఆ వివాహిత అత్తవారింట్లో మరణించిందనేందుకు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఇందుకు మళ్లీ ప్రత్యక్ష సాక్ష్యాలు అవసరం లేదని పేర్కొంది. కానీ ఇది అరుదైన కేసేమీ కానందున జీవితఖైదు విధించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆ కారణంగా శిక్ష తగ్గిస్తున్నట్టు పేర్కొంది.