Share News

చార్జిషీటు తర్వాత రిమాండే తప్పంటే ఎలా?

ABN , Publish Date - Jun 09 , 2026 | 03:52 AM

ఒక కేసుకు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని స్థాయిల్లో బెయిలు పిటిషన్‌ తిరస్కరణకు గురైన తర్వాత నిందితుల తరఫు న్యాయవాదులు అసలు...

చార్జిషీటు తర్వాత రిమాండే తప్పంటే ఎలా?

  • ఈ దశలో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ కుదరదు

  • వాటికి అనుమతించే సుప్రీం తీర్పు అసంబద్ధం

  • అలహాబాద్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

అలహాబాద్‌, జూన్‌ 8: ఒక కేసుకు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని స్థాయిల్లో బెయిలు పిటిషన్‌ తిరస్కరణకు గురైన తర్వాత నిందితుల తరఫు న్యాయవాదులు అసలు కేసు ప్రారంభంలో నిందితుడిని నిర్బంధించడమే అక్రమంగా జరిగిందంటూ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేస్తున్నారని అలహాబాద్‌ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిందితుడిని రిమాండ్‌ చేయడంలోనే తప్పుంటే దిద్దుకోలేని అన్యాయం అవుతుందని, కేసు ఏ దశలో ఉన్నా నిందితుడి ప్రాథమిక హక్కు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఇలాంటి పిటిషన్లకు గేట్లు తెరిచిందంటూ సర్వోన్నత న్యాయస్థానాన్నే తప్పుబట్టింది. అభియోగపత్రం దాఖలై, విచారణలో భాగంగా సాక్ష్యాల నమోదు కూడా జరుగుతున్న దశలో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు వేసేందుకు అనుమతిస్తే తేనె తుట్టెను కదిపినట్లే అవుతుందని జస్టిస్‌ సిద్ధార్ధ్‌, జస్టిస్‌ వినయ్‌ కుమార్‌ ద్వివేదీ ధర్మాసనం అభిప్రాయపడింది. నిందితుల అరెస్టు, రిమాండ్‌, అక్రమ నిర్బంధాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు విభిన్నంగా ఉన్నాయని ప్రస్తావించింది. ఒక వ్యక్తిని ఒక కేసులో జ్యుడీషియల్‌ కస్టడీకి పంపిన తర్వాత అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని తేలినప్పటికీ హెబియస్‌ కార్ప్‌సకు అనుమతించ రాదని పాత తీర్పులు ఉన్నాయని గుర్తు చేసింది. తాజాగా వచ్చిన మరికొన్ని తీర్పుల్లో మాత్రం కేసు ఏ దశలో ఉన్నా రాజ్యాంగ హక్కుల కోసం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయొచ్చని చెప్పారని ప్రస్తావించింది. భార్యను, ఏడాది వయసు కూతుర్ని వరకట్నం కోసం వేధించి చంపాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వేసిన హెబియస్‌ కార్పస్‌ కేసులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అతని బెయిలు పిటిషన్‌ను కింది కోర్టు కొట్టేసింది. రెండేళ్ల తర్వాత తన అరెస్టే నిబంధనల ప్రకారం జరగలేదని నిందితుడు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశాడు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దర్యాప్తు నడిచే వరకే అనుమతించాలని పేర్కొంది. ఒకే అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు భిన్నంగా ఉన్నందున వాటికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఒకసారి బెయిలు పిటిషన్‌ను తిరస్కరిస్తే ఇక హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడానికి కుదరదని తాము ఆదేశాలిస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Jun 09 , 2026 | 03:52 AM