ఉపాధిని దెబ్బతీసిన భార్యకు భరణం ఇవ్వక్కర్లేదు
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:47 AM
భార్య కారణంగా భర్త ఉపాధి కోల్పోతే విడాకుల అనంతరం ఆమెకు భరణం ఇవ్వాల్సిన పనిలేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రయాగ్‌రాజ్, జనవరి 24: భార్య కారణంగా భర్త ఉపాధి కోల్పోతే విడాకుల అనంతరం ఆమెకు భరణం ఇవ్వాల్సిన పనిలేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో భరణం అడిగే హక్కు ఉండదని తెలిపింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో హోమియోపతి వైద్యుడిగా పనిచేస్తున్న వేద్ ప్రకాశ్ సింగ్‌పై క్లినిక్‌లోనే ఆయన మామ, బావమరుదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన వెన్నెముకలో బుల్లెట్ ఇరుక్కొంది. ఆపరేషన్ చేస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉండడంతో దాన్ని అలాగే ఉంచాల్సి వచ్చింది. కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఆయన సంపాదన శక్తిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో భార్యకు విడాకులు ఇచ్చారు. తనకు భరణం ఇప్పించాలని ఆమె కుషినగర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా కోర్టు నిరాకరించింది. భార్య హైకోర్టులో అప్పీలు చేయగా ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థించింది.