ఇద్దరు పైలట్లూ సమర్థులే!
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:24 AM
బారామతిలో ప్రమాదానికి గురైన లియర్‌జెట్- 45 విమానంలో పైలట్ ఇన్ కమాండ్‌గా కెప్టెన్ సుమిత్ కపూర్ వ్యవహరించగా.. శాంభవి పాఠక్ ఫస్ట్ ఆఫీసర్‌గా పనిచేశారు.
ఒకరికి 16,500 గంటల సుదీర్ఘ అనుభవం
మరొకరు న్యూజిలాండ్‌లో శిక్షణ పొంది, పైలట్ శిక్షకురాలిగా పనిచేసిన యువతి
ముంబై, జనవరి 28: బారామతిలో ప్రమాదానికి గురైన లియర్‌జెట్- 45 విమానంలో పైలట్ ఇన్ కమాండ్‌గా కెప్టెన్ సుమిత్ కపూర్ వ్యవహరించగా.. శాంభవి పాఠక్ ఫస్ట్ ఆఫీసర్‌గా పనిచేశారు. ప్రధాన పైలట్ సుమిత్‌కు 16,500 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. అత్యంత అనుభవజ్ఞుడైన పైలట్‌గా గుర్తింపు పొందిన ఆయన.. ఇంతకుముందు సహరా, జెట్‌లైన్, జెట్ ఎయిర్‌వేస్ వంటి విమానయాన సంస్థల్లో పనిచేశారు. ఇక కో-పైలట్ శాంభవి (26) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందినవారు. ఆమె తండ్రి వైమానిక దళంలో పనిచేశారు. దీనితో ఆమెకు చిన్న వయసు నుంచే విమానయానంపై మక్కువ ఉండేది. ఈ క్రమంలో గ్వాలియర్‌లోని ఎయిర్‌ఫోర్స్ బాలభారతి స్కూల్‌లో శాంభవి చదువుకున్నారు. 2016-18 మధ్య సెకండరీ విద్యను పూర్తి చేశారు. ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీఎస్సీ పట్టా పొందారు. న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో శిక్షణ తీసుకుని లైసెన్స్ పొందారు. ఆ తర్వాత భారత్‌కు వచ్చి మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్‌లో అసిస్టెంట్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తూ, ఇతర పైలట్లకు శిక్షణ ఇచ్చారు. డీజీసీఏ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్‌తో పాటు ఫ్రోజెన్ ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ కూడా పొందారు. 2022 నుంచి వీఎ్‌సఆర్ వెంచర్స్ సంస్థలో ఫస్ట్ ఆఫీసర్ (కో-పైలట్)గా పనిచేస్తూ.. లియర్‌జెట్ -45 వంటి బిజినెస్ జెట్ విమానాలను నడిపే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శాంభవికి 1,500 గంటలకుపైగా విమానం నడిపిన అనుభవం ఉంది.