Share News

మీ విశ్వసనీయ ప్రభుత్వం...

ABN , Publish Date - Jan 29 , 2026 | 03:18 AM

విమాన ప్రమాదంలో మరణించడానికి ముందుగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పెట్టిన చివరి ‘ఎక్స్‌’ పోస్టు వైరల్‌ అవుతోంది.

మీ విశ్వసనీయ ప్రభుత్వం...

  • అజిత్‌ పవార్‌ చివరి ‘ఎక్స్‌’ పోస్టు!

న్యూఢిల్లీ, జనవరి 28: విమాన ప్రమాదంలో మరణించడానికి ముందుగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పెట్టిన చివరి ‘ఎక్స్‌’ పోస్టు వైరల్‌ అవుతోంది. ‘మీ విశ్వసనీయ ప్రభుత్వం..’ అంటూ ఇటీవలి మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను ఆ పోస్టులో ప్రజలతో ఆయన పంచుకున్నారు. కాంట్రాక్టర్ల పనికి జరిపే చెల్లింపుల విధానంలో మార్పులు; వొకేషనల్‌ శిక్షణా కేంద్రాల ఏర్పాటు; పలు విభాగాలు, ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూముల లీజు గడువు పెంపు వంటి కేబినెట్‌ నిర్ణయాలను ఆయన పేర్కొన్నారు. పైకి ఇదంతా సాధారణ వ్యవహారంలాగే కనిపిస్తోంది. కానీ, ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రి హోదాలో ఉన్న అజిత్‌ పవార్‌, అలాంటి సాధారణ పోస్టు పెట్టడం ఏమిటనే చర్చ సర్వత్రా మొదలైంది. ముంబై, పుణె సహా 29 నగరాలకు మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా అధికార మహాయుతి కూటమిలో విభేదాలు చోటుచేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. మహాయుతిలోని పార్టీలు ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేయగలవనేది బీజేపీ ఈసారి గట్టిగా పట్టించుకుంది. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటులో ఎన్‌సీపీ (అజిత్‌ పవార్‌)ని పక్కన పెట్టేసింది. ఈ క్రమంలో ఆయన ప్రతిపక్ష ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు, బాబాయి శరద్‌ పవార్‌ను కలిశారు. పింప్రి, పుణె పుర ఎన్నికల్లో కలిసి పోటీచేద్దామని కోరారు. శరద్‌తో కలిస్తే అజిత్‌ పవార్‌ పార్టీకి ఇక్కడ విజయం నల్లేరు మీద నడకే అవుతుందని జాతీయ మీడియా అంచనా వేసింది. కానీ బీజేపీయే గెలిచింది. తర్వాత పరిస్థితి కాస్త కుదుటపడింది. అజిత్‌ పవార్‌ తాజా పోస్టును బట్టి, ఆ గొడవలన్నీ సద్దుమణిగి కూటమిలో సాధారణ స్థితి నెలకొన్నట్టు ఆయన చెప్పదలుచుకున్నారని అనిపిస్తోందని అంటున్నారు.

Updated Date - Jan 29 , 2026 | 03:18 AM