సీఎం కావాలన్న కల నెరవేరకుండానే...!
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:17 AM
ఏ రోజుకైనా మహారాష్ట్రకు సీఎం కావాలనుకున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66), చివరకు తన కల నెరవేరకుండానే విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
ఆరుసార్లు డిప్యూటీ సీఎం, 8 సార్లు ఎమ్మెల్య్ఠేగా ఉన్న అజిత్ పవార్
ముంబై, జనవరి 28: ఏ రోజుకైనా మహారాష్ట్రకు సీఎం కావాలనుకున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66), చివరకు తన కల నెరవేరకుండానే విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తన రాజకీయ జీవితంలో ఆరుసార్లు డిప్యూటీ సీఎం అయ్యారు. తనకు ఢిల్లీ రాజకీయాలకన్నా మహారాష్ట్ర సామ్రాజ్యమే ఇష్టమని, ఏదో ఒకరోజు సీఎం అవుతానని మీడియా ప్రతినిధులతో తరచూ చెబుతూ ఉండేవారాయన. అయితే తన కల నెరవేరకముందే ప్రాణాలు కోల్పోయారు. మరాఠా యోధుడు శరద్ పవార్‌కు అన్న (అనంత్ పవార్) కుమారుడైన అజిత్ పవార్ అహల్యానగర్ దేవ్‌లాలీలో 1959 జులై 22న జన్మించారు. బారామతి కేంద్రంగా 1982లో 23 ఏళ్ల వయసులో చక్కర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. పాల సంఘాలు, చక్కర ఫ్యాక్టరీలు, సహకార బ్యాంకుల నిర్వహణతో 1991లో పూణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా ఎదిగారు. 1991లో బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నెగ్గాక శరద్ పవార్ కోసం సీటు త్యాగం చేశారు. నాడు ఇదే నియోజకవర్గం నుంచి మళ్లీ గెలుపొందిన శరద్ పవార్ నాటి పీవీ ప్రభుత్వంలో రక్షణమంత్రి అయ్యారు. ఆ తర్వాత అజిత్ పవార్ 1991 నుంచి ఇప్పటివరకు బారామతి నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
మరాఠా నాటకీయ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్
మహారాష్ట్ర నాటకీయ పరిణామాలకు కేరాఫ్ అడ్ర్‌సగా మారిన అజిత్ పవార్ ఆరుసార్లు డిప్యూటీ సీఎం అయ్యారు. తొలినుంచీ శరద్ పవార్ వెంటే ఉన్న ఆయన తరచూ ధిక్కార స్వరం వినిపించేవారు. కాంగ్రె్‌సకు గుడ్‌బై చెప్పి 1999లో ఎన్సీపీ ప్రారంభించిన బాబాయ్ వెంటే చాలా కాలం నడిచినా తిరుగుబాటుకు వెనుకాడలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చిన్నాన్నతో విభేదించి ఫడణవీస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కేవలం 80గంటలు మాత్రమే ఉన్నారు. తిరిగి బాబాయ్ గూటికి చేరారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు. 2022లో తిరుగుబాటు లేవదీసి ఎన్సీపీని రెండుగా చీల్చి మహాయుతి కూటమి మిత్రపక్షంగా మారి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. 2024లోనూ డిప్యూటీ సీఎం అయ్యారు. మరోవైపు అజిత్ పవార్ ఎంత చక్రం తిప్పినా ఎప్పటికీ మహారాష్ట్ర సీఎం కాలేరని శరద్ పవార్ తరచూ చెప్పిన జోస్యాన్ని నిజం చేస్తూ.. దురదృష్టవశాత్తూ ఆయన కనుమరుగయ్యారు.