Share News

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దుర్మరణం

ABN , Publish Date - Jan 29 , 2026 | 03:39 AM

ప్రైవేటు జెట్‌ విమానం కూలిన ఘటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌ దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దుర్మరణం

  • విమానం కుప్పకూలిన ఘటనలో మృతి

  • ఇద్దరు పైలట్లతో పాటు సహాయకుడు, వ్యక్తిగత భద్రతాధికారి కూడా..

  • ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా దుర్ఘటన

  • బుధవారం ఉదయం 8.45 గంటలకు ప్రమాదం

  • పొగ మంచు కారణంగా రన్‌ వే కనబడక ఇబ్బంది

  • బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ముందు రన్‌వే మొదట్లో కూలిన విమానం

  • చిన్న ఎయిర్‌ఫీల్డ్‌ కావడంతో అందుబాటులో లేని ‘ఇన్‌స్ట్రుమెంటల్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌’

  • స్థానిక పైలట్లతోనే ఎయిర్‌ ట్రాఫిక్‌ పర్యవేక్షణ

  • రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖుల దిగ్ర్భాంతి

  • అజిత్‌ వారసులెవరో!.. భార్యా.. కుమారుడా?

  • పవార్‌ ఎన్‌సీపీలో పార్టీ విలీనమా?

పుణె/ జనవరి 28: ప్రైవేటు జెట్‌ విమానం కూలిన ఘటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌ దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని పుణె సమీపంలోని బారామతిలో బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. మరణించిన వారిలో అజిత్‌తోపాటు విమానం ప్రధాన పైలట్‌ (పైలట్‌ ఇన్‌ కమాండ్‌) సుమిత్‌ కపూర్‌, రెండో పైలట్‌ (ఫస్ట్‌ ఆఫీసర్‌) శాంభవి పాఠక్‌, సిబ్బంది పింకీ మాలి, పవార్‌ వ్యక్తిగత భద్రతాధికారి విదీప్‌ జాధవ్‌ ఉన్నారు.


ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరి..

మహారాష్ట్రలో జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ప్రచారం కోసం అజిత్‌ పవార్‌ బుధవారం ఉదయం 8.10 గంటలకు ముంబై నుంచి ఢిల్లీ వీఎ్‌సఆర్‌ వెంచర్స్‌ సంస్థకు చెందిన లియర్‌జెట్‌-45 అద్దె విమానంలో పుణె జిల్లాలోని బారామతికి బయల్దేరారు. ఈ రెండింటి మధ్య దూరం 256 కిలోమీటర్లు, ప్రయాణ సమయం సుమారు 45 నిమిషాలు. విమానం 8.39 గంటల సమయంలో బారామతి సమీపానికి చేరుకుంది. కానీ ల్యాండ్‌ అవకుండా ముందుకెళ్లింది. కాసేపటికి తిరిగి వచ్చి ల్యాండ్‌ కావడానికి ప్రయత్నిస్తూ.. రన్‌ వేకు కాస్త ముందే కూలిపోయింది. నేలపై రెండు ముక్కలుగా విడిపోయి, మంటల్లో చిక్కుకుంది. వరుసగా నాలుగైదు పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని, విమానంలోని వారిని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు తీవ్రంగా ఉండటంతో వీలుకాలేదని తెలిపారు. అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. వారికి పార్థ్‌, జయ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం ఉదయం బారామతిలోని విద్యా ప్రతిస్థాన్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్‌పవార్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. అజిత్‌ దుర్మరణం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టింది. ప్రమాద స్థలంలో ఆధారాలను సేకరించింది.

పొగ మంచు కారణంగానే ప్రమాదం

దట్టంగా కమ్ముకున్న పొగ మంచు కారణంగానే అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినట్టు పౌర విమానయాన శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. పైలట్లు ల్యాండింగ్‌ కోసం పలుమార్లు ప్రయత్నించి, చివరికి రన్‌వేకు సమీపంలోనే కూలిపోయినట్టు తేల్చింది. విమానాల నిర్వహణ సంస్థ తరఫునగానీ, విమానంలోగానీ భద్రతాపరమైన లోపాలేమీ లేవని పేర్కొంది. దీనిపై తొలుత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు పలు వివరాలను వెల్లడించారు. అనంతరం పూర్తి వివరాలతో ఆ శాఖ ప్రకటన విడుదల చేసింది. ముంబై నుంచి బయలుదేరిన ఈ విమానం పైలట్లు సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉండగానే బారామతి విమానాశ్రయం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)ని సంప్రదించారు. వాతావరణ పరిస్థితి, విజిబులిటీ ఆధారంగా ల్యాండింగ్‌కు ప్రయత్నించాలని పైలట్లకు ఏటీసీ సూచించింది. గాలి వేగం, విజిబిలిటీ, ఇతర అంశాలు బాగానే ఉన్నాయని పైలట్లు సమాధానమిచ్చారు. విమానాశ్రయం సమీపంలోకి చేరుకున్నాక ల్యాండింగ్‌ కోసం విమానాన్ని కిందకు తీసుకొచ్చారు. కానీ రన్‌ వే కనిపించడం లేదంటూ ఏటీసీకి సమాచారమిచ్చి మళ్లీ పైకి తీసుకెళ్లారు. అలాగే ముందుకెళ్లి, చుట్టూ తిరిగి మళ్లీ రన్‌ వే ప్రారంభం వైపు వచ్చారు. ఆ సమయంలో విమానం సుమారు కిలోమీటరు ఎత్తున, గంటకు 237 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. రన్‌వే కనిపిస్తోందా అని ఏటీసీ సిబ్బంది అడిగితే.. ఇంకా కనిపించలేదని, కనబడగానే సమాచారం ఇస్తామని చెప్పారు. కొన్ని సెకన్ల తర్వాత తమకు రన్‌ వే కనిపిస్తోందని ఏటీసీకి చెప్పారు. రన్‌ వే-11పై విమానం ల్యాండింగ్‌కు అనుమతిస్తున్నామని 8.43 గంటలకు ఏటీసీ సిబ్బంది స మాచారమిచ్చారు. కానీ పైలట్ల నుంచి తిరిగి సమాధానం(రీడ్‌ బ్యాక్‌) రాలేదు. ఏటీసీ అనుమతి ఇచ్చిన మేరకు.. విమానాన్ని ఎంత వేగంతో, ఏ రన్‌వేపై, ఎటువైపునుంచి ల్యాండింగ్‌ చేస్తున్నారనే వివరాలను పైలట్లు తిరిగి చెప్పడమే రీడ్‌ బ్యాక్‌. ఏటీసీ సూచనలను పైలట్లు సరిగా విని, అనుసరిస్తున్నారన్నది నిర్ధారించుకోవడమే దీని ఉద్దేశం. కానీ ఈ విమానం పైలట్లు రీడ్‌ బ్యాక్‌ చేయలేదు. తర్వాత ఒకట్రెండు నిమిషాల్లోనే రన్‌వే మొదలవడానికి సుమారు 150మీటర్ల ముందే విమానంకూలిపోయింది.


17 విమానాలతో అద్దె సర్వీసులు

వీఎ్‌సఆర్‌ వెంచర్స్‌ సంస్థ నాన్‌ షెడ్యూల్డ్‌ విమాన ఆపరేటర్‌గా పనిచేస్తోంది. అంటే నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం అని కాకుండా.. అవసరాన్ని బట్టి అద్దెపై విమానాలను నడుపుతుంది. ఈ సంస్థ వద్ద తాజాగా కూలిన విమానం సహా ఏడు లియర్‌ జెట్లు, ఐదు ఎంబ్రాయర్‌ 135 బీజే, నాలుగు కింగ్‌ ఎయిర్‌ బీ200, ఒక పిలాటస్‌ పీసీ-12 విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమాదానికి గురైన విమానానికి ‘పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ)’ గత ఏడాది ఫిబ్రవరిలో తనిఖీలు చేసి, క్లియరెన్స్‌ ఇచ్చింది. కాగా, తమ విమానంలో సాంకేతిక లోపాలేమీ లేవని, ప్రమాదానికి కారణం ఏమిటన్నదానిపై పరిశీలన చేస్తున్నామని వీఎ్‌సఆర్‌ వెంచర్స్‌ సంస్థ ప్రకటించింది.

ఆ సదుపాయం లేకపోవడంతో సమస్య!

వర్షం, పొగమంచు వంటి సందర్భాల్లో, వెలుతురు సరిగా లేనప్పుడు, రాత్రిళ్లు కూడా రన్‌ వేపై విమానం సరిగ్గా ల్యాండ్‌ కావడం కోసం విమానాశ్రయాల్లో ‘ఇన్‌స్ట్రుమెంటల్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌’ ఉంటుంది. ఇది రేడియో నావిగేషన్‌ సహాయంతో విమానాలు రన్‌వేపై ల్యాండ్‌ కావడానికి దారిచూపుతుంది. అయితే బారామతి విమానాశ్రయం చిన్నది కావడంతో ఇక్కడ ‘ఇన్‌స్ట్రుమెంటల్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌’ అందుబాటులో లేదు. దీనితో పైలట్లు తమ సొంత విచక్షణ, అనుభవంతోనే ల్యాండింగ్‌ చేయాల్సి ఉంటుంది. తాజా ఘటనలో రన్‌ వే సరిగా కనిపించక పైలట్లు ఇబ్బందిపడి.. ల్యాండింగ్‌ సమయంలో నేలను ఢీకొని ఉంటారనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ విమానాశ్రయంలో పూర్తిస్థాయి ఏటీసీ వ్యవస్థ కూడా లేదు.

Updated Date - Jan 29 , 2026 | 05:56 AM