Share News

విమాన టిక్కెట్లపై సర్‌చార్జీ

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:49 AM

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం విమానయాన రంగంపై పడింది. విమాన ఇంధనం ధరలు విపరీతంగా పెరగడంతో దానికి అనుగుణంగా టిక్కెట్ల ధరలు పెరిగాయి.

విమాన టిక్కెట్లపై సర్‌చార్జీ

  • దేశీయ విమానాలపై రూ.399

  • విదేశీ సర్వీసులపై 10-60 డాలర్లు

  • పశ్చిమాసియా యుద్ధ ప్రభావం

న్యూఢిల్లీ, మార్చి 10: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం విమానయాన రంగంపై పడింది. విమాన ఇంధనం ధరలు విపరీతంగా పెరగడంతో దానికి అనుగుణంగా టిక్కెట్ల ధరలు పెరిగాయి. టిక్కెట్ల రేట్లపై ఫ్యూయల్‌ సర్‌ఛార్జీ విధిస్తూ విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి రానుంది. ముందుగా బుక్‌ చేసుకున్న టిక్కెట్లకు సర్‌ఛార్జీ వర్తించదని స్పష్టం చేశాయి. ఒకవేళ ప్రయాణ తేదీలను మార్చుకుంటే చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. టిక్కెట్లపై సర్‌ఛార్జీ విధిస్తున్నట్టు మంగళవారం ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు ప్రకటించాయి. మొదటి దశలో దేశీయ సర్వీసుల టిక్కెట్లపై రూ.399 సర్‌ఛార్జీ విధించాయి. సార్క్‌ దేశాల విమానాలకు కూడా ఇది వర్తిస్తుంది. అంతర్జాతీయ విమానాల విషయానికి వస్తే పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లే సర్వీసులపై 10డాలర్లు(సుమారు రూ.900) వసూలు చేయనున్నాయి. ఆఫ్రికా దేశాలకు వెళ్లే విమానాల టిక్కెట్లపై ఇప్పటికే 30 డాలర్లు వసూలు చేస్తుండగా, దాన్ని 90 డాలర్లకు పెంచాయి. ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లే విమానాలపై 20డాలర్ల సర్‌ఛార్జీ వసూలు చేస్తుండగా దాన్ని 60డార్లకు పెంచాయి. రెండో దశలో యూరోప్‌, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాలకు వెళ్లే విమానాలపై సర్‌ఛార్జి 25 డాలర్ల నుంచి 50 డాలర్లకు పెరగనుంది. ఈ నిర్ణయం ఈ నెల 18 నుంచి అమల్లోకి రానుంది.

Updated Date - Mar 11 , 2026 | 03:49 AM