పుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం పైలట్‌పై వేటు
ABN , Publish Date - Sep 05 , 2026 | 06:11 AM
గత నెలలో థాయిలాండ్‌లోని పుకెట్ నుంచి వస్తూ గగన తలంలో ఒక్కసారిగా 300 అడుగులు కిందకు జారిన ఎయిర్‌ఇండియా విమానం పైలట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
మత్తుపదార్థాలు తీసుకున్నట్లు తేలడంతో ఎయిరిండియా చర్యలు
ఘటనపై డీజీసీఏకు ఏఏఐబీ ప్రాథమిక నివేదిక
న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: గత నెలలో థాయిలాండ్‌లోని పుకెట్ నుంచి వస్తూ గగన తలంలో ఒక్కసారిగా 300 అడుగులు కిందకు జారిన ఎయిర్‌ఇండియా విమానం పైలట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అతడు మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు శుక్రవారం ‘ఎక్స్’లో పెట్టిన ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఆ విమానం(ఎయిర్‌బస్ ఏ320) కిందకు జారడానికి ముందు దాని కీలక హైడ్రాలిక్ వ్యవస్థలు మూడు ఒకేసారి పనిచేయకుండా ఆగిపోయాయని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) శుక్రవారం డీజీసీఏకి సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. తర్వాత విమానం కిందకు జారి పోయినట్లు పేర్కొంది. పైలెట్ మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యిందని, ఇది చాలా తీవ్రమైన విషయమని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక సమర్పించిన గంటల్లోనే ఎయిర్ ఇండియా పైలెట్‌ను తొలగించడం గమనార్హం. విమానం ప్రి-ఫ్లైట్ తనిఖీలో ఎటువంటి లోపాలు కనిపించలేదని ఏఏఐబీ తెలిపింది.