Share News

ఎయిర్‌ ఇండియా విమాన టికెట్‌ ధరలు భగ్గు!

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:52 AM

దేశీయ, అంతర్జాతీయ విమానయానం మరింత భారంగా మారనుంది. ఎయిర్‌ ఇండియా గ్రూప్‌ విమాన టికెట్లపై ఇంధన సర్‌చార్జీని పెంచాలని నిర్ణయించింది.

ఎయిర్‌ ఇండియా విమాన టికెట్‌ ధరలు భగ్గు!

  • దేశీయ విమానాలపై రూ.299 నుంచి రూ.899 వరకు ఇంధన సర్‌చార్జీ పెంపు

ముంబై, ఏప్రిల్‌ 7: దేశీయ, అంతర్జాతీయ విమానయానం మరింత భారంగా మారనుంది. ఎయిర్‌ ఇండియా గ్రూప్‌ విమాన టికెట్లపై ఇంధన సర్‌చార్జీని పెంచాలని నిర్ణయించింది. విమానాల ప్రయాణ దూరాన్ని బట్టి సర్‌చార్జీలను విధించింది. దేశీయ విమాన సర్వీసులపై రూ.299 నుంచి రూ.899 వరకు, అంతర్జాతీయ విమాన సర్వీసులపై(కొన్ని మార్గాలు మినహా) 24 డాలర్ల నుంచి 280 డాలర్ల వరకు ఇంధన సర్‌చార్జీని విధించనున్నట్టు మంగళవారం వెల్లడించింది. సవరించిన ఇంధన సర్‌చార్జీలు దేశీయ ప్రయాణికులకు బుధవారం (ఏప్రిల్‌ 8) నుంచి, అంతర్జాతీయ ప్రయాణికులకు 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇంధన సర్‌చార్జీల పెంపుతో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్‌ ఇండియా విమానాల టికెట్‌ ధరలు పెరగనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమన్న నేపథ్యంలోనే ఇటీవల విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలను దేశీయ చమురు సంస్థలు పెంచాయి. అయితే దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి ఏటీఎఫ్‌ ధర పెంపును 25 శాతానికే ప్రభుత్వం పరిమితం చేసింది. ఇందుకనుగుణంగా ఎయిర్‌ ఇండియా గ్రూప్‌ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇంధన సర్‌చార్జీని పెంచింది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి చివరినాటికి అంతర్జాతీయ సగటు విమాన ఇంధన ధర 99.40 డాలర్లు ఉండగా.. మార్చి 27తో ముగిసిన వారానికి 195.19 డాలర్లకు పెరిగింది. విమానయాన సంస్థ మొత్తం వ్యయాల్లో ఏటీఎఫ్‌ వాటాయే దాదాపు 40-45 శాతం ఉంటుంది. దీని ధర పెరిగితే విమానయాన సంస్థలు తమ టికెట్‌ చార్జీలను పెంచే పరిస్థితి ఏర్పడుతుంది.

Updated Date - Apr 08 , 2026 | 03:52 AM