ఫ్రీ టికెట్లు అమ్ముకున్నారు!
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:20 AM
ఎయిరిండియాలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే ఉచిత విమాన టికెట్లను కొందరు అధిక ధరలకు అమ్ముకున్నారు. సంస్థ అంతర్గత విచారణలో ఈ విషయాన్ని గుర్తించారు.
సొమ్ము చేసుకున్న ఎయిరిండియా ఉద్యోగులు
లీజర్ ట్రావెల్ పాలసీ దుర్వినియోగం.. 4 వేలమందికి జరిమానా.. చర్యలు?
న్యూఢిల్లీ, మార్చి 15: ఎయిరిండియాలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే ఉచిత విమాన టికెట్లను కొందరు అధిక ధరలకు అమ్ముకున్నారు. సంస్థ అంతర్గత విచారణలో ఈ విషయాన్ని గుర్తించారు. ఎయిరిండియాలో ఎంప్లాయూ లీజర్ ట్రావెల్ పాలసీ కింద ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులకు నిర్దిష్ట సంఖ్యలో ఉచిత విమాన ప్రయాణ టికెట్లు అందజేస్తారు. 4 వేలమందికి పైగా ఉద్యోగులు ఈ పాలసీని దుర్వినియోగం చేసినట్టు ఆ సంస్థ గుర్తించింది. వారికి జరిమానా వేయడంతో పాటు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మోసపూరితంగా పొందిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించింది. కొందరు తమ కుటుంబ సభ్యులు కాని వారిని బంధువులుగా చూపించి ఉచిత విమాన ప్రయాణ సదుపాయాన్ని దుర్వినియోగం చేశారు. కొందరు ఇతర వ్యక్తులకు అధిక ధరలకు టికెట్లు అమ్ముకున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఉల్లంఘనలు, క్లైమ్‌లు జరిగినట్టు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. కాగా నిర్దిష్టంగా ఎంతమంది ఉద్యోగులు లీజర్ ట్రావెల్ పాలసీని దుర్వినియోగం చేశారు? ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు? ఎంత సొమ్ము పొందారు? వంటి విషయాలు తెలియరాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులు లీజర్ ట్రావెల్ పాలసీ కింద ప్రయోజనాలు పొందేందుకు నిబంధనలను సంస్థ కఠినతరం చేసింది. నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను 2022లో టాటా గ్రూపు కొనుగోలు చేసింది. ప్రస్తుతం సంస్థలో 24 వేలమందికి పైగా పనిచేస్తున్నారు.