మళ్లీ భయపెట్టిన బోయింగ్!
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:33 AM
అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని మరువకముందే.. ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం మళ్లీ భయపెట్టింది....
ఏఐ విమానంలో సాంకేతిక సమస్య
ఇంజన్ ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్ విఫలం
బయలుదేరే ముందు గుర్తించిన పైలట్
లండన్-బెంగళూరు విమానం రద్దు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని మరువకముందే.. ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం మళ్లీ భయపెట్టింది..! లండన్ నుంచి బెంగళూరుకు రావాల్సిన ఈ విమానంలో ఇంజన్ ఇంధన నియంత్రణ స్విచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే విమానం బయల్దేరే ముందే దీన్ని గుర్తించడంతో పెను ప్రమా దం తప్పింది. ఎయిరిండియా (ఏఐ 132) విమానం లండన్‌లోని హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు రావాల్సి ఉంది. అయితే అక్కడ బయల్దేరే ముందు ఇంజన్ స్టార్ట్ చేస్తున్న సమయం లో ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్ విఫలమైనట్టు పైలట్ గుర్తించారు. ఎడమవైపు ఉన్న స్విచ్ ఆటోమ్యాటిక్‌గా కటాఫ్ పొజిషన్‌కు మారటాన్ని గమనిం చి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో తమ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ వి మానాన్ని నిలిపివేసినట్టు ఎయిరిండియా సోమవారం ప్రకటించింది. అనంతరం ఈ విషయాన్ని పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏకు తెలియజేసింది.
అహ్మదాబాద్ ప్రమాదానికి ఇదే కారణం..
గత ఏడాది జూలైలో అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదం కూడా ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్ వైఫల్యం వల్లే సంభవించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ఈ స్విచ్ రన్ మోడ్ నుంచి కటాఫ్ మోడ్‌లోకి మారినట్టు గుర్తించారు. తాజాగా లండన్-బెంగళూరు విమానంలోనూ ఈ స మస్యే తలెత్తింది. విమానం బయల్దేరక ముందే సమస్యను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.