ఏఐతో ప్రశ్నపత్రాల తయారీతో లీకులకు చెక్
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:58 AM
దేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న విధానంలో భారీ మార్పులు అవసరమని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, పరీక్షల సంస్కరణల టాస్క్ఫోర్స్ చైర్మన్ నందన్ నీలేకని అన్నారు.
పరీక్షల సంస్కరణ టాస్క్ఫోర్స్ చైర్మన్ నందన్ నీలేకని
న్యూఢిల్లీ, అక్టోబరు 13: దేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న విధానంలో భారీ మార్పులు అవసరమని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, పరీక్షల సంస్కరణల టాస్క్ఫోర్స్ చైర్మన్ నందన్ నీలేకని అన్నారు. పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి ఒక పెద్ద క్వశ్చన్ బ్యాంక్ నుంచి కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో చివరి నిమిషంలోనే ప్రశ్నపత్రాలను రూపొందించాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన బ్లూమ్బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్లో ఆయన మాట్లాడారు. ముందుగానే ప్రశ్నపత్రాన్ని తయారు చేసే సంప్రదాయ విధానాన్ని పక్కన పెట్టాలన్నారు. ‘దీనికి పరిష్కారంగా భారీ సంఖ్యలో ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ను ఏర్పాటు చేసుకోవాలి. పరీక్ష జరిగే రోజున చివరి నిమిషంలో ఏఐ సాయంతో ఆ క్వశ్చన్ బ్యాంక్ నుంచి అప్పటికప్పుడు ప్రశ్నపత్రాన్ని రూపొందించాలి. అప్పుడు ఒక నిర్దిష్టమైన పేపర్ అనేదానికి అస్కారమే ఉండదు. అలాగే దాన్ని విక్రయించి లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉండదు’ అని నీలేకని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానానికి మార్చాలని నొక్కిచెప్పారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా దేశంలో ఇప్పటికే 1,50,000 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, ఈ నెట్వర్క్ను మరింత విస్తరించాలని అన్నారు.