Edappadi Palaniswami: పురుషులకూ ఉచిత బస్సు
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:32 AM
త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే తొలి విడత హామీలను ప్రకటించింది. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్....
రేషన్‌కార్డున్న గృహిణులకు నెలకు 2వేలు
తమిళనాట అన్నాడీఎంకే ఎన్నికల హామీలు
చెన్నై, జనవరి 17(ఆంధ్రజ్యోతి): త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే తొలి విడత హామీలను ప్రకటించింది. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ 109వ జయంతి సందర్భంగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) శనివారం 5కీలక హామీలను ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైతే సిటీ, టౌన్ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. రేషన్‌కార్డు ఉన్న గృహిణులందరికీ ప్రతినెలా రూ.2వేల ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఈ మొత్తాన్ని కుటుంబంలోని మహిళ బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని తెలిపారు. సొంత ఇల్లు లేని పేదలందరికీ కాంక్రీట్ ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వమే స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించి ఇస్తుందని, నగర ప్రాంతాల్లోనూ ప్రభుత్వమే రెసిడెన్షియల్ ఫ్లాట్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. ఉమ్మడి కుటుంబంలో ఉండి, వివాహం అయిన తర్వాత వేరు కాపురం పెట్టేవారికి కూడా ప్రభుత్వమే స్థలం కొనుగోలు చేసి కాంక్రీటు ఇల్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. కాగా, డీఎంకే ప్రభుత్వం ఇప్పటికే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు రేషన్‌కార్డు ఉన్నవారికి నెలకు రూ.వెయ్యి చొప్పున అందిస్తోంది.