అన్నాడీఎంకేకు రెబల్స్ ఝలక్!
ABN , Publish Date - May 26 , 2026 | 04:14 AM
తమిళనాడు రాజకీయాల్లో సోమవారం రెండు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు..
ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
స్పీకర్ ఆమోదం.. వెంటనే టీవీకేలో చేరిక
పళనిస్వామి వైపు యూటర్న్ తీసుకున్న ఐదుగురు అసమ్మతి వర్గ ఎమ్మెల్యేలు
క్షమాపణలు చెబుతూ లేఖ అందజేత
చెన్నై, మే 25 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాజకీయాల్లో సోమవారం రెండు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, అధికార పార్టీలో చేరి ఝలక్ ఇవ్వగా.. ఇదే సమయంలో రెబల్స్ లిస్టులో ఉన్న మరో ఐదుగురు శాసనసభ్యులు తిరిగి పళనిస్వామి క్యాంపులో చేరడం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకే మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మరకతం కుమరవేల్(మరురాంతం), జయకుమార్ (పెరుందురై), సత్యభామ (ధారాపురం) తమ పదవులకు రాజీనామాలు చేస్తూ లేఖలు అందజేయగా.. వాటిని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ సాయంత్రానికి ఆమోదించినట్లు ప్రకటన చేయడం గమనార్హం. ఈ ముగ్గురు రాజీనామాల అనంతరం పీడబ్ల్యూడీ మంత్రి ఆదవ్ అర్జునాను ఆయన చాంబర్ కలిసి, టీవీకే పార్టీలో చేరారు. ఆదవ్ వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ, టీవీకే సభ్యత్వ కార్డులు అందజేశారు. ఆ తర్వాత రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ను కలిశారు.
తిరిగి పళనిస్వామి వర్గంలోకి ఐదుగురు
ఇదిలా ఉండగా అనర్హత వేటుకు భయపడి అసమ్మతి వర్గానికి చెందిన ఐదుగురు శాసనసభ్యులు సుకుమార్, హరిభాస్కర్, మోహన్, దిలీపన్ జయశంకర్, నటరాజన్‌లు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిని ఆయన నివాసంలో కలిసి, మద్దతు ప్రకటించారు. పార్టీ విప్‌ను ధిక్కరించి అసెంబ్లీలో టీవీకేకు మద్దతు ప్రకటించినందుకు క్షమాపణ పత్రాలు అందజేశారు. ఈపీఎస్ ఈ ఐదుగురిని తన వర్గంలో చేర్చుకున్నట్లు పార్టీ సీనియర్ నేత కేపీ మునుసామి ప్రకటించారు. ఈ విషయాన్ని పళనిస్వామి వర్గీయులు స్పీకర్‌కు రాతపూర్వకంగా తెలియజేశారు. ఈ ఐదుగురు శాసనసభ్యులు మళ్లీ ఈపీఎ్‌సకు మద్దతు ప్రకటించడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వీరిపై అనర్హత వేటు పడదని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. ఈ ఐదుగురు తిరిగి రాకతో పళనిస్వామి వర్గంలోని ఎమ్మెల్యేల సంఖ్య 22 నుండి 27కు పెరిగింది. ఈ నెల 13న అసెంబ్లీలో జరిగిన విజయ్ ప్రభుత్వ బలపరీక్షలో.. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ, అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి మద్దతు ప్రకటించారు.
సచివాలయమా? టీవీకే ఆఫీసా?: డీఎంకే
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంపై మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ లేనప్పుడు డీఎంకే మిత్రపక్షాల మద్దతు కోరుతూ లేఖలు రాయడం, ఆ తర్వాత అన్నాడీఎంకేలోని ఓ వర్గాన్నే తమ వైపునకు తిప్పుకోవడం, ప్రస్తుతం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి.. టీవీకే అడుగడుగునా అవినీతిని ప్రోత్సహిస్తూ, దుష్టశక్తిగా మారిందని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. టీవీకే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మూడు నియోజకవర్గాల ప్రజలపై ఉప ఎన్నికలను బలవంతంగా రుద్దుతోందన్నారు. డీఎంకే ఎంపీ విల్సన్ స్పందిస్తూ.. రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు సచివాలయంలోనే పార్టీలోకి ఆహ్వానిస్తూ చేసిన హడావుడిని చూస్తుంటే.. అది సచివాలయమా? టీవీకే కార్యాలయమా?అనే అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు.