Share News

ఏఐ సదస్సులో చైనా రోబో డాగ్‌పై వివాదం

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:06 AM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో ఓ వర్సిటీ నిర్వాకం తీవ్ర విమర్శలకు దారితీసింది. గ్రేటర్‌ నోయిడాకు చెందిన ప్రైవేటు యూనివర్సిటీ గల్గోటియాస్‌ ఏఐ సదస్సులో....

ఏఐ సదస్సులో చైనా రోబో డాగ్‌పై వివాదం

  • గల్గోటియాస్‌ వర్సిటీ క్షమాపణలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో ఓ వర్సిటీ నిర్వాకం తీవ్ర విమర్శలకు దారితీసింది. గ్రేటర్‌ నోయిడాకు చెందిన ప్రైవేటు యూనివర్సిటీ గల్గోటియాస్‌ ఏఐ సదస్సులో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. అందులో ‘ఓరియన్‌’ పేరిట రూపొందించిన రోబో డాగ్‌ను ప్రదర్శించింది. దాన్ని తమ వర్సిటీలోనే అభివృద్ధి చేసినట్లు వర్సిటీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అలాంటి రోబో డాగ్‌నే చైనా రోబోటిక్‌ కంపెనీ యూనిట్రీ జీవో2 పేరిట విక్రయిస్తోంది. భారత్‌లోనూ వాటిని విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విదేశీ సాంకేతికతను తమ ఆవిష్కరణగా ప్రచారం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్టాల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని నిర్వాహకులు వర్సిటీని ఆదేశించారు. ఈ అంశంపై బుధవారం యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. స్టాల్‌లో ఉన్న తమ ప్రతినిధి అవగాహనా రాహిత్యం వల్లే ఈ గందరగోళం ఏర్పడినట్లు తెలిపింది. ఆ రోబో డాగ్‌ను చైనా సంస్థ నుంచే కొనుగోలు చేశామని, విద్యార్థులు నేర్చుకోవడానికి ఒక సాధనంగా వాడుతున్నామని వెల్లడించింది. ‘‘ఏఐ సదస్సులో గందరగోళం నెలకొన్నందుకు క్షమాపణలు కోరుతున్నాం. మా ప్రతినిధి ఒకరు అవగాహనా రాహిత్యంతో మాట్లాడారు. ఆమెకు రోబోడాగ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాల గురించి అవగాహన లేదు. కెమెరా ముందు అత్యుత్సాహంతో మాట్లాడుతూ తప్పుడు సమాచారం ఇచ్చింది. ఆ ఆవిష్కరణ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయాలన్న ఉద్దేశం మాకు లేదు’’ అని వర్సిటీ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, బుధవారం ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌ స్పందిస్తూ.. సదస్సులో ఎవరైనా ఇతరులు తయారు చేసిన వస్తువులను తాము అభివృద్ధి చేసినట్లుగా చెప్పుకోవడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. సరైన ప్లానింగ్‌ లేకుండా, చైనా వస్తువుల గురించి కూడా ప్రచారం చేసుకుంటున్నారంటూ కేంద్రాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఏ మాత్రం మేధస్సే లేని వారు కృత్రిమ మేధ గురించి రెడీమేడ్‌ ట్వీట్‌లు పోస్ట్‌ చేయకూడదని రాహుల్‌ని తీవ్రంగా విమర్శించింది. ప్రపంచ వేదికలపై భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తున్న సమయంలో దేశ ప్రతిష్ఠను దిగజార్చడమే రాహుల్‌ పనిగా పెట్టుకొంటారని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ధ్వజమెత్తారు.

Updated Date - Feb 19 , 2026 | 04:06 AM