300 బిలియన్ డాలర్లు.. ఏఐలో భారీగా పెట్టుబడులు
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:28 AM
ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా భారత్‌కు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కృత్రిమ మేధలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి...
ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పలు ఒప్పందాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా భారత్‌కు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కృత్రిమ మేధలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక భారత్‌తో పాటు విదేశీ ప్రభుత్వాలు అంగీకరించినవి కూడా కలిపితే ఆ పెట్టుబడుల విలువ మొత్తం 300 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని తెలిపాయి. ఇవన్నీ ఐదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. వీటిలో 70 బిలియన్ డాలర్లు గతంలోనే నిశ్చయమైనవి కాగా, 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇటీవల ప్రకటించారు. ఇవన్నీ కూడా ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, కంప్యూటింగ్ సామర్థ్యం పెంపునకు సంబంధించినవే. రిలయన్స్ కంపెనీ ఒక్కటే వచ్చే ఏడేళ్లలో ఏఐ, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సుమారు 110 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో తెలిపింది. ఇక అదానీ గ్రూప్ 2035 నాటికి 150 బిలియన్ డాలర్లను పునరుత్పాదక ఆధారిత ఏఐ డేటా సెంటర్లు, దానికి అనుబంధ విభాగాల్లో పెట్టుబడులు పెడుతుంది. ఇక మైక్రోసాఫ్ట్ 2030 నాటికి గ్లోబల్ సౌత్‌లో 50 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకోగా, దానిలో 17.5 బిలియన్ డాలర్లు భారత్‌కే కేటాయించింది.