Share News

కృత్రిమ మేధ వినియోగంలో ఏఐ సదస్సు టర్నింగ్‌ పాయింట్‌

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:42 AM

భవిష్యత్తులో కృత్రిమ మేధ(ఏఐ)ను ప్రపంచం ఎలా ఉపయోగించనుందనే విషయంలో భారతదేశం నిర్వహించిన ఐఏ ఇంపాక్ట్‌ సదస్సు ఒక టర్నింగ్‌ పాయింట్‌గా నిరూపణ అయ్యిందని ప్రధాని మోదీ తెలిపారు.

కృత్రిమ మేధ వినియోగంలో ఏఐ సదస్సు టర్నింగ్‌ పాయింట్‌

  • మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: భవిష్యత్తులో కృత్రిమ మేధ(ఏఐ)ను ప్రపంచం ఎలా ఉపయోగించనుందనే విషయంలో భారతదేశం నిర్వహించిన ఐఏ ఇంపాక్ట్‌ సదస్సు ఒక టర్నింగ్‌ పాయింట్‌గా నిరూపణ అయ్యిందని ప్రధాని మోదీ తెలిపారు. మన ఆవిష్కరణలు ప్రపంచ నేతలను ఆకట్టుకున్నాయన్నారు. ప్రతినెలా చివరి ఆదివారం రేడియో ద్వారా నిర్వహించే మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. సదస్సులో ప్రత్యేకించి రెండు ఆవిష్కరణలు ఎక్కువగా ఆకట్టుకున్నాయని చెప్పారు. వాటిలో ఒకటి అమూల్‌ కేంద్రం కాగా, మరొకటి భారత సంస్కృతి పరిరక్షణకు సంబంధించినదని తెలిపారు. జంతువుల చికిత్సలో కృత్రిమ మేధ ఎలా ఉపయోగపడుతోందో, తమ పశువులు ఎక్కడున్నాయో 24/7 ఏఐ అసిస్టెంట్‌ సాయంతో రైతులు ఎలా కనుగొంటున్నారనే విషయాలను అమూల్‌ బూత్‌లో చక్కగా వివరించారని మోదీ ప్రశంసించారు. అలాగే, నేటి తరానికి అందుబాటులో ఉండేలా భారత పురాతన గ్రంథాలు, పరిజ్ఞానం, రాతప్రతులను పరిరక్షించడంలో కృత్రిమ మేధ ఎలా ఉపయోగపడుతోందో చూసి ప్రపంచ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. భారత్‌లో తయారైన మూడు ఏఐ మోడళ్లను కూడా సదస్సులో ఆవిష్కరించామని పేర్కొన్నారు. మరోవైపు, టీ-20 ప్రపంచ కప్‌ క్రికెట్‌లో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు అనేక దేశాల తరఫున ఆడుతుండటం సంతోషకరమని మోదీ పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా మానసిక బానిసత్వం నుంచి కూడా స్వాతంత్య్రం పొందడం అవసరమని మోదీ అన్నారు. ఇందులో భాగంగానే బానిసత్వ చిహ్నాలను దేశం త్యజిస్తోందన్నారు. ఆ దిశగా రాష్ట్రపతిభవన్‌ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్రపతిభవన్‌లోని బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్‌ ఎడ్విన్‌ లుటియెన్స్‌ విగ్రహాన్ని తొలగించి, ఆ స్థానంలో స్వతంత్ర భారత మొట్టమొదటి గవర్నర్‌ జనరల్‌ రాజగోపాలాచారి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్టు తెలిపారు. స్వాత్రంత్యం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్‌ పాలకుల విగ్రహాలు రాష్ట్రపతిభవన్‌లో ఉండటం దురదృష్టకరమన్నారు. కాగా, కేరళకు చెందిన 10నెలల చిన్నారి ఆలిన్‌ షెరిన్‌ అవయవదానంతో నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించడాన్ని మోదీ ప్రశంసించారు.

Updated Date - Feb 23 , 2026 | 01:42 AM