Share News

ముంచుకొస్తున్న ఏఐ హ్యాకింగ్‌ ముప్పు

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:42 AM

ప్రభుత్వ, వ్యాపార వెబ్‌సైట్లను కుప్పకూల్చగల సామర్థ్యం ఉన్న ఏఐ (కృత్రిమ మేధ) మోడళ్లు అందుబాటులోకి వచ్చే రోజులు మరెంతో దూరంలో లేవని..

ముంచుకొస్తున్న ఏఐ హ్యాకింగ్‌ ముప్పు

  • ఏఐ సాయంతో సైబర్‌ నేరగాళ్లు సైతం ప్రభుత్వ సైట్లపై దాడులు చేసే ప్రమాదం

  • 5 దేశాల నిఘా సంస్థల ఉమ్మడి హెచ్చరిక

న్యూఢిల్లీ, జూన్‌ 23: ప్రభుత్వ, వ్యాపార వెబ్‌సైట్లను కుప్పకూల్చగల సామర్థ్యం ఉన్న ఏఐ (కృత్రిమ మేధ) మోడళ్లు అందుబాటులోకి వచ్చే రోజులు మరెంతో దూరంలో లేవని.. అందుకు ఇంకా కొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉన్నదని ‘ఫైవ్‌ ఐస్‌’గా పేరొందిన ఐదు దేశాల(అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, కెనడా) నిఘా సంస్థలు ఒక ఉమ్మడి ప్రకటన ద్వారా హెచ్చరించాయి. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాల నేతలు సత్వర చర్యలు చేపట్టాలని.. ఆ మాయదారి ఏఐ దాడులను అడ్డుకోవడానికి రక్షణ ఏఐ(డిఫెన్సివ్‌ ఏఐ) మోడళ్లను రూపొందించుకోవాలని సూచించాయి. సైబర్‌ దాడుల ముప్పును కేవలం ఒక సాంకేతిక సమస్యగా మాత్రమే చూడరాదని.. ఇది వ్యాపారాలు ఎదుర్కోబోయే ప్రధానమైన ముప్పు అని స్పష్టం చేశాయి. అమెరికాకు చెందిన ఆంత్రోపిక్‌ సంస్థ ఇటీవల రూపొందించిన ఫేబుల్‌ 5, మైథోస్‌ 5 ఏఐ మోడళ్లను విదేశీయులు వాడకుండా నిషేధించాలని ట్రంప్‌ సర్కారు ఆదేశించింది గుర్తుందా? వెబ్‌సైట్లలో ఉండే భద్రతాలోపాలను ఇట్టే గుర్తించి.. ఆ లొసుగులను వాడుకుని సైబర్‌ దాడులు చేయగల వైర్‌సలను, స్ర్కిప్ట్‌లను రాయగల సామర్థ్యం ఆ ఏఐ మోడళ్లకు ఉండడమే ఇందుకు కారణం. అత్యంత భద్రత ఉండే ప్రభుత్వ, వ్యాపార వెబ్‌సైట్లను హ్యాక్‌ చేయాలంటే ఇన్నాళ్లుగా అందుకు నిపుణులైన హ్యాకర్ల అవసరం ఉండేది. కానీ, ఈ తరహా ఏఐ మోడళ్లతో సాధారణ సైబర్‌ నేరగాళ్లు, ఉగ్రవాద సంస్థలు హ్యాకింగ్‌కు పాల్పడే ప్రమాదం ఉందన్నది ‘ఫైవ్‌ ఐస్‌’ నిఘా సంస్థల ఆందోళన.

Updated Date - Jun 24 , 2026 | 03:42 AM