Share News

ఏఐతో ఉద్యోగాలకుపెను ముప్పు!

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:37 AM

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని పరితపిస్తున్న భారత్‌ ఒకవైపు అవకాశాలు, మరోవైపు ముప్పులు పొంచివున్న నాలుగు రోడ్ల కూడలిలో నిలబడిందని జాతీయ ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.

ఏఐతో ఉద్యోగాలకుపెను ముప్పు!

  • వైట్‌ కాలర్‌ కొలువుల్లో భారీగా కోతలు

  • ఏఐ రంగంలో అమెరికా అలవిమాలిన పెట్టుబడులు

  • 2008 తరహా సంక్షోభానికి 20ు వరకు అవకాశం

  • 2025-26 జాతీయ ఆర్థిక సర్వే అంచనాలు

  • అనిశ్చితిలోనూ 7.4ు జీడీపీ వృద్ధి రేటుకు అవకాశం

  • ఊబకాయం, డిజిటల్‌ అడిక్షన్‌ అతిపెద్ద ఆరోగ్య ముప్పు

  • ఉప్పు, తీపి, నూనె పదార్థాలపై చట్టబద్ధ హెచ్చరికలు

  • ప్రవాసులు పంపింది రూ.12.5 లక్షల కోట్లు

  • రూ.64.5 లక్షల కోట్ల విదేశీ మారక నిల్వలు

  • కావాలంటే దాంతో విదేశీ అప్పు మొత్తం తీర్చొచ్చు

  • వేగంగా పెరుగుతున్న నగరాలు.. హైదరాబాద్‌ ః 4

  • తెలంగాణకు సొంత పన్నుల నుంచే అధిక ఆదాయం

  • కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో సాగు విస్తీర్ణం పెరిగింది

  • రాష్ట్ర ద్రవ్యోల్బణం కూడా తగ్గుతోంది: కేంద్ర ఆర్థిక సర్వే

న్యూఢిల్లీ, జనవరి 29: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని పరితపిస్తున్న భారత్‌ ఒకవైపు అవకాశాలు, మరోవైపు ముప్పులు పొంచివున్న నాలుగు రోడ్ల కూడలిలో నిలబడిందని జాతీయ ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ముఖ్యంగా ప్రపంచాన్ని ఊపేస్తున్న ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకుంటే అమెరికా తర్వాత అత్యధిక ఏఐ లిటరేట్స్‌ ఉన్న భారతదేశం జీడీపీ పరంగా ఎక్కడికో వెళ్లిపోతుందని అంచనా వేస్తోంది. అయితే, బడాబడా కంపెనీలన్నీ ఏఐ రంగంలో లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కుమ్మరించిన నేపథ్యంలో ఏమైనా తేడా వస్తే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థే 2008 తరహా సంక్షోభంలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా జరిగే అవకాశం 10 నుంచి 20 శాతం వరకు ఉందని, దాన్ని విస్మరించలేమని చెప్పింది. అదే జరిగితే మనుగడ పోరాటంలో భాగంగా మహామహా ఐటీ కంపెనీలు పెట్టే బడ్జెట్‌ కోతల్లో ప్రధానంగా సమిధలయ్యేది భారతీయవైట్‌ కాలర్‌ ఉద్యోగులేనని హెచ్చరించింది. ఏఐ అమల్లోకి వచ్చిన 2022 నుంచే రొటీన్‌ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయని, ఆర్థిక సంక్షోభం ఖాయమైతే తీవ్రత ఊహించలేని విధంగా ఉంటుందని అప్రమత్తం చేసింది. కేంద్రం ఏఐ ఆర్థిక మండలిని ఏర్పాటు చేసి, ఉద్యోగాలను కాపాడుకొనే మార్గాలను అన్వేషించాలని పిలుపునిచ్చింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లోనూ భారత్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.


ప్రభుత్వం దగ్గర దాదాపు రూ.65 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయని, అందులో ఈ ఏడాది ప్రవాసులు పంపిన డబ్బులే రూ.12 లక్షల కోట్లు ఉంటాయని తెలిపింది. దేశంలో ఊబకాయం అతిపెద్ద ఆరోగ్య సమస్యగా అవతరించిందని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. అత్యంత ప్రాసెస్‌ చేసిన ఆహారం, కదలకుండా కూర్చోవడం కలగలిసి చిన్న పెద్దా పల్లె పట్నం తేడా లేకుండా అందర్నీ మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు బారిన పడేట్లు చేస్తున్నాయని గణాంకాలతో ప్రస్తావించింది. అత్యంత ప్రాసెస్‌ చేసిన ఆహారం పదిహేనేళ్లలో 40 రెట్లు పెరిగిందని, ఊబకాయం రెండింతలు అయిందని వెల్లడించింది. పిల్లలు మెలకువగా ఉన్న సమయంలో టీవీల్లో ఫుడ్‌ యాడ్‌లు రాకుండా చూడాలని, నూనె, ఉప్పు, చక్కెర ఎక్కువగా వాడే ఆహారంపై సిగరెట్ల లాగా చట్టబద్ధమైన హెచ్చరికలు పెట్టాలని సలహా ఇచ్చింది.


డిజిటల్‌ అడిక్షన్‌ జాతీయ ఆరోగ్య సమస్యగా పరిణమించిందని, ఎక్కువ సేపు స్ర్కీన్‌ చూడటం, సోషల్‌ మీడియా స్ర్కోల్‌ చేయడం వల్ల యువత సామాజిక బంధాలను పూర్తిగా కోల్పోవడమే కాకుండా తెలివితేటలు కూడా దెబ్బతింటున్నాయని తెలిపింది. జీడీపీలో 12ు డిజిటల్‌ ఎకానమీ నుంచే వస్తున్న నేపథ్యంలో రెండింటినీ సమన్వయం చేయాలని సూచించింది. విద్యార్థులు ఏఐని విచ్చలవిడిగా వాడటం వల్ల ఆందోళన, కుంగుబాటు పెరిగి సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. యూత్‌ హబ్‌లు ఏర్పాటు చేసి యువత కలుసుకొనే వేదికలు కల్పించాలని చెప్పింది. 1.2 కోట్ల గిగ్‌ వర్కర్లలో 40 శాతం మందికి నెలకు రూ.15 వేలు కూడా రావడం లేదని సర్వే ప్రస్తావించింది. గంటకు లేదా టాస్క్‌ను బట్టి ఇంత కనీస వేతనం ఉండేట్లు నిబంధనలు పెట్టాలని సూచించింది.

Updated Date - Jan 30 , 2026 | 06:52 AM