అగ్నివీరులు పెళ్లి చేసుకోవచ్చు!
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:02 AM
అగ్నివీరులు తొలి నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అనంతరం పొందే రెండేళ్ల సర్వీసు పొడిగింపు వ్యవధిలో పెళ్లి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
పొడిగించిన రెండేళ్ల సర్వీసులో వివాహానికి అనుమతి
న్యూఢిల్లీ, నవంబరు 22: అగ్నివీరులు తొలి నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అనంతరం పొందే రెండేళ్ల సర్వీసు పొడిగింపు వ్యవధిలో పెళ్లి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, పొడిగించిన ఆ రెండేళ్ల సర్వీసు సమయంలో పెళ్లి చేసుకుని గర్భం దాల్చిన మహిళా అగ్నివీరులకు పూర్తిస్థాయి ప్రసూతి ప్రయోజనాలు, సెలవులు అమలవుతాయని ప్రకటించింది. ఈ మేరకు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తాజాగా సడలించింది. కాగా, 2022లో అగ్నివీరుల నిబంధనలను కేంద్రం రూపొందించింది. ఆ నిబంధనల ప్రకారం మొదటి నాలుగేళ్ల సర్వీసులో వారు పెళ్లి చేసుకోవడానికి అనుమతించరు. అనంతరం రెండేళ్ల సర్వీసు పొడిగింపు పొందినవారు మళ్లీ నెల రోజుల శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ శిక్షణ పూర్తయిన అనంతరం వారు పెళ్లి చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. కాగా, అగ్నివీరులు 100 శాతం మందికీ రెగ్యులర్ సైనికులుగా అవకాశం కల్పిస్తూ ఈనెల మొదట్లో ప్రభుత్వం విధానపరమైన మార్పులు చేసిన సంగతి తెలిసిందే.