నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై అఫ్ఘాన్ బాంబులు
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:37 AM
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ వైమానికదళం పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి వైమానిక దాడులు చేసినట్టు వెల్లడించింది.
పాక్‌లోని అనేక సైనిక స్థావరాలపైనా దాడులు
తాలిబన్ల నేతృత్వంలోని అప్ఘాన్ రక్షణ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 2: పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ వైమానికదళం పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి వైమానిక దాడులు చేసినట్టు వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న నూర్‌ఖాన్ వైమానిక స్థావరంపై భారీ దాడులు చేసినట్టు అఫ్ఘాన్ రక్షణ శాఖ ఎక్స్‌లో ప్రకటించింది. ఈ దాడులు ఎంతో సమన్వయంతో, కచ్చితత్వంతో నిర్వహించినట్టు పేర్కొంది. రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, బలూచిస్థాన్‌లోని క్వెట్టాలో ఉన్న 12వ డివిజన్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కీలకమైన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టు తాలిబన్ నేతృత్వంలోని అఫ్ఘాన్ రక్షణ శాఖ తెలిపింది. అయితే ఇవి ఇంకా ధ్రువీకరణ కాలేదు. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ పాకిస్థాన్‌లోని అత్యంత వ్యూహాత్మకమైన వైమానిక స్థావరాల్లో ఒకటి. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దాడుల వల్ల నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ బాగా దెబ్బతింది. దానికి పాకిస్థాన్ మరమ్మతులు చేపడుతోంది. కాగా... కాబూల్, బాగ్రామ్‌లను లక్ష్యంగా చేసుకుని ఇటీవల పాక్ వైమానిక దాడులకు పాల్పడిందని, దానికి ప్రతీకారంగానే తాము ఈ దాడులు చేశామని అఫ్ఘాన్ అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇస్లామాబాద్, కాబూల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. సరిహద్దుల్లో భద్రతా దళాల మధ్య ఘర్షణలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి పరిస్థితిని బహిరంగ యుద్ధంగా పాక్ అభివర్ణించింది.
దాడి ఆరోపణలను ఖండించని పాక్...!
పాక్‌లోని కీలక స్థావరాలపై వైమానిక దాడులు చేశామంటూ తాలిబన్లు చేసిన ప్రకటనలపై పాకిస్థాన్ ఇంతవరకూ స్పందించలేదు. పాక్ అధికారులు ఎవరూ ఈ దాడులను ధ్రువీకరించలేదు. దీంతో ఈ దాడులు జరిగాయా లేదా.. వాటివల్ల ఏమైనా నష్టం జరిగిందా అనే అంశాలపై స్పష్టత లేదు. ఒకవేళ దాడులు నిజమైతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.