Share News

అడోబ్‌ పగ్గాలు అనిల్‌ చక్రవర్తికి!

ABN , Publish Date - Sep 05 , 2026 | 05:19 AM

ప్రపంచ సాఫ్ట్వేర్‌ దిగ్గజం అడోబ్‌ నాయకత్వంలో భారీ మార్పు చోటు చేసుకుంది. భారతీయ నేపథ్యం ఉన్న అనిల్‌ చక్రవర్తిని సంస్థ కొత్త చైర్మన్‌, సీఈవోగా నియమిస్తూ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది.

అడోబ్‌ పగ్గాలు అనిల్‌ చక్రవర్తికి!

  • 18 ఏళ్ల శాంతను నారాయణ్‌ శకానికి ముగింపు

  • డిసెంబరు 1న బాధ్యతల్లోకి కొత్త సీఈవో

శాన్‌జోస్ , సెప్టెంబరు 4: ప్రపంచ సాఫ్ట్వేర్‌ దిగ్గజం అడోబ్‌ నాయకత్వంలో భారీ మార్పు చోటు చేసుకుంది. భారతీయ నేపథ్యం ఉన్న అనిల్‌ చక్రవర్తిని సంస్థ కొత్త చైర్మన్‌, సీఈవోగా నియమిస్తూ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆయన డిసెంబరు 1న బాధ్యతలు తీసుకుంటారు. అదేరోజు డైరెక్టర్ల బోర్డులో చేరతారు. గత 18 ఏళ్లుగా సీఈవో బాధ్యతల్లో ఉన్న హైదరాబాదీ శాంతను నారాయణ్‌ ఇక ఎగ్జిక్యూటివ్‌ చైర్‌గా వ్యవహరిస్తారు. వారసుడిని ఎంపిక చేశాక తప్పుకుంటానని శాంతను నారాయణ్‌ ఈ ఏడాది మార్చిలోనే ప్రకటించారు. ఏఐ యుగంలో అడోబ్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సరైన వ్యక్తి అనిల్‌ అని శంతను ప్రశంసించారు. అనిల్‌ 2020లో అడోబ్‌లో ప్రవేశించారు. అనిల్‌ వారణాసి ఐఐటీలో బీటెక్‌, యూఎస్‌ ఎంఐటీలో పీహెచ్‌డీ చేశారు. సీఈవోగా అనిల్‌ ఎంపిక ప్రకటన జరగగానే క్రియేటివ్‌ విభాగానికి నేతృత్వం వహిస్తున్న డేవిడ్‌ వాధ్వానీ తాను అడోబ్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నేతృత్వం వహిస్తున్న విభాగం నుంచే అడోబ్‌కు 30శాతం ఆదాయం వస్తోంది. వాధ్వానీనే సీఈవోగా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అడోబ్‌ షేర్లు 3.4శాతం పతనమయ్యాయి.


హైదరాబాద్‌ ఐకాన్‌ శాంతను

ఫార్చ్యూన్‌500 కంపెనీల్లో భారతీయ సీఈవోల చర్చ వచ్చినపుడల్లా సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల సరసన హైదరాబాద్‌కు చెందిన శాంతను నారాయ ణ్‌ పేరు కూడా వస్తుంది. 1998లో అడోబ్‌లో సీనియర్‌ మేనేజర్‌గా చేరిన నారాయణ్‌ 2005లో దానికి సీవోవో, 2007లో సీఈవో అయ్యారు. ఇప్పటివరకు పదవిలో కొనసాగుతున్నారు.

Updated Date - Sep 05 , 2026 | 05:20 AM