Share News

5,675 కోట్లు.. 56.75 కోట్లయింది!

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:04 AM

పర్యావరణ అనుమతుల కోసం ఒక ప్రాజెక్టు విలువను రూ.5,675 కోట్లుగా చూపిన అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ.. నిబంధనల ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మించే ప్రాంతంలో ఉన్న పులుల అభయారణ్య సంరక్షణ కోసం..

5,675 కోట్లు.. 56.75 కోట్లయింది!

  • మహారాష్ట్రలో అదానీ గ్రీన్‌పవర్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు.. అంచనా వ్యయం రూ.5,675 కోట్లు

  • అందులో 4శాతం పులుల అభయారణ్య సంరక్షణకు చెల్లించాలని మహారాష్ట్ర వన్యప్రాణి బోర్డు ఆదేశం

  • ఆ ప్రకారం 227 కోట్లు.. ప్రాజెక్టు వ్యయం 56.75 కోట్లేనంటూ అదానీ సంస్థ మరో అఫిడవిట్‌

  • దాంట్లో 4శాతం అంటే.. కట్టాల్సింది రూ.2.27 కోట్లే.. అందుకు మహారాష్ట్ర వైల్డ్‌లైఫ్‌ పీసీసీఎఫ్‌ ఓకే

  • ముందస్తు చెల్లింపుగా 56.75 లక్షలు జమ.. వన్యప్రాణి వార్డెన్‌ అప్రమత్తం.. పీఎంవోకు ఫిర్యాదు

  • కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు విచారణ.. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ కథనంతో వెలుగులోకి

న్యూఢిల్లీ, నవంబరు 15: పర్యావరణ అనుమతుల కోసం ఒక ప్రాజెక్టు విలువను రూ.5,675 కోట్లుగా చూపిన అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ.. నిబంధనల ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మించే ప్రాంతంలో ఉన్న పులుల అభయారణ్య సంరక్షణ కోసం 4శాతం చెల్లించాల్సి వచ్చేసరికి ప్రాజెక్టు విలువను అమాంతం వందో వంతుకు తగ్గించి చూపించింది. దీంతో అభయారణ్య సంరక్షణ కోసం ఆ కంపెనీ చెల్లించాల్సిన మొత్తం కూడా రూ.227 కోట్ల నుంచి రూ.2.27 కోట్లకు తగ్గిపోయింది!! దీనిపై ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో వచ్చిన కథనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో తారాళి డ్యామ్‌ రిజర్వాయర్‌పై 1500 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టును నిర్మించేందుకు అదానీ సంస్థ సిద్ధమైంది. ఇందుకు అవసరమైన పర్యావరణ అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ 2025 ఫిబ్రవరి 11న రాసిన లేఖలో ప్రాజెక్టు వ్యయం రూ.5,675 కోట్లని స్పష్టంగా ఉంది. ఆ లేఖ ప్రకారం.. 2026 ఫిబ్రవరి 23న మహారాష్ట్ర వన్యప్రాణి బోర్డు అదానీ సంస్థకు 15 షరతులు విధించింది. అందులో ఒకటి.. ప్రాజెక్టు వ్యయంలో 4శాతం మేర వన్యప్రాణి సంరక్షణకు కేటాయించాలి. అంటే రూ.227 కోట్లు. ఆ మొత్తాన్ని సహ్యాద్రి టైగర్‌ రిజర్వు బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయాలని సూచించింది.


ఈమేరకు.. రూ.227 కోట్లు జమచేయాలంటూ 2026 మార్చిలో మహారాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ (పీసీసీఎఫ్ -వైల్డ్‌లైఫ్‌) ఎం.శ్రీనివాస్‌ రెడ్డి అదానీ సంస్థను కోరారు. ఆయన విజ్ఞప్తికి స్పందిస్తూ.. ఈ ఏడాది సెప్టెంబరు 8న అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఒక నోటరైజ్డ్‌ అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ‘అనలాగస్‌ ఎస్టిమేషన్‌’ పద్ధతిలో వేశామని.. వాస్తవానికి ఈ ప్రాజెక్టు వ్యయం రూ.56.75 కోట్లేనని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. ‘అనలాగస్‌ ఎస్టిమేషన్‌’ అంటే.. గతంలో ఇదే తరహా ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంత ఖర్చయిందో చూసి, దాని ఆధారంగా వేసే అంచనా. అదానీ సంస్థ దాఖలు చేసిన ఈ కొత్త అఫిడవిట్‌ను అక్టోబరు 12న ఆమోదించిన పీసీసీఎఫ్‌ శ్రీనివాస్‌ రెడ్డి.. ప్రాజెక్టు వ్యయం రూ.56.75 కోట్లలో 4శాతం రూ.2.27 కోట్లని, అందులో నాలుగో వంతు రూ.56.75 లక్షలు వెంటనే సహ్యాద్రి టైగర్‌ రిజర్వ్‌ ఖాతాలో డిపాజిట్‌ చేయాలని సూచించారు. మిగతా మొత్తాన్ని ‘నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌’ నుంచి ఈ ప్రాజెక్టుకు అనుమతి లభించాక చెల్లించాల్సి ఉంటుంది. పీసీసీఎఫ్‌ సూచన మేరకు వెంటనే అదానీ సంస్థ నాలుగో వంతు సొమ్మును జమ చేసింది. కానీ, ప్రాజెక్టు విలువను తప్పుగా చూపారంటూ.. సతారా జిల్లా ఆనరరీ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ రోహన్‌ భాటే ప్రధాని కార్యాలయానికి, మహారాష్ట్ర సీఎంకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు.. ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా కొయ్‌నా వైల్డ్‌లైఫ్‌ శాంక్చువరీ డిప్యూటీ డైరెక్టర్‌కు నవంబరు 5న ఆదేశాలు అందాయి. నవంబరు 6న కేంద్ర పర్యావరణ శాఖ కూడా దీనిపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.


అది ప్రైవేటు భూమి..

ప్రాజెక్టు వ్యయం వందో వంతుకు తగ్గిపోవడంపై అదానీ సంస్థను ప్రశ్నించగా.. చట్టబద్ధమైన బాధ్యతలను తప్పించుకోవడానికే ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించామంటూ వస్తున్న ఆరోపణను తీవ్రంగా ఖండించింది. అది పూర్తిగా తప్పుదోవ పట్టించే ఆరోపణ అని కొట్టిపారేసింది. అటవీ/వన్యప్రాణి పోర్టల్‌లో తాము ఇచ్చిన ప్రతిపాదన సైట్‌ ఇన్వెస్టిగేషన్‌ కోసమేనని.. మహారాష్ట్ర రాష్ట్ర వన్యప్రాణి బోర్డు ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయాన్ని రూ.5,675 కోట్లుగానే పరిగణించిందని అదానీ సంస్థ ప్రతినిధి తెలిపారు. ‘‘సైట్‌ ఇన్వెస్టిగేషన్‌ వ్యయం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1శాతం ఉంటుంది’’ అని ఆయన గుర్తుచేశారు. అలాగే.. ప్రాజెక్టులోని అన్ని భాగాలూ కొయినా వన్యప్రాణి అభయారణ్యానికి 3.2కిలోమీటర్ల దూరంలో, సహ్యాద్రి టైగర్‌ రిజర్వ్‌ నోటిఫైడ్‌ బఫర్‌ జోన్‌కు బయట ఉన్నాయని, ఈ ప్రాజెక్టును అటవీ భూమిలో నిర్మించట్లేదని తెలిపారు. పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు పనిచేసే సమయంలో దిగువ ప్రాంతంలోని జీవావరణంపైన, పర్యావరణంపైన, అడవులు, వన్యప్రాణులపైన ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవన్నారు. ఇక.. పీసీసీఎఫ్‌ శ్రీనివాస్‌ రెడ్డిని దీనిపై ప్రశ్నించగా.. ‘సవరించిన ప్రాజెక్టు వ్యయ అంచనాతో అఫిడవిట్‌ను ఎందుకు సమర్పించిందో అదానీ సంస్థనే అడగండి’ అని ఆయన సమాధానం ఇచ్చినట్టు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్థ తన కథనంలో పేర్కొంది.

Updated Date - Nov 16 , 2026 | 03:06 AM