Share News

స్టాలిన్‌ కావాలో.. నేను కావాలో తేల్చుకోండి

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:30 AM

అదుపు తప్పిన ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ కావాలో, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండే తాను కావాలో తేల్చుకోవాలని ప్రముఖ సినీ నటుడు...

స్టాలిన్‌ కావాలో.. నేను కావాలో తేల్చుకోండి

  • ప్రజలకు టీవీకే అధినేత విజయ్‌ పిలుపు.. సభలో మరొకరు బలి

చెన్నై, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): అదుపు తప్పిన ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ కావాలో, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండే తాను కావాలో తేల్చుకోవాలని ప్రముఖ సినీ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘నాకు అనుభవం లేదని కొంతమంది విమర్శిస్తున్నారు. నిజమే.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకునే అనుభవం నాకు లేదు. నాలాగా సొంతంగా పార్టీని స్థాపించి, ఒక్క శాతం ఓట్లయినా పొందే శక్తి ఉందా’ అంటూ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు సవాల్‌ విసిరారు. శుక్రవారం ఉదయం సేలం శివారు సీలనాయకన్‌పట్టిలో జరిగిన పార్టీ నిర్వాహకుల సమావేశంలో మాట్లాడిన విజయ్‌.. డీఎంకే, ఏఐడీఎంకేలపై విమర్శల వర్షం కురిపించారు. కాగా.. ఈ బహిరంగసభలో మరొకరు బలయ్యారు. చనిపోయిన యువకుడు మహారాష్ట్రకు చెందిన వెండి ఆభరణాల కార్మికుడు సూరజ్‌ (37)గా పోలీసులు గుర్తించారు. ఐదు వేల మంది మాత్రమే పట్టే ప్రాంగణానికి టీవీకే నేతలు పరిమితికి మించి కార్యకర్తలను తీసుకొచ్చారు. ప్రాంగణంలో కుర్చీలు వేయలేదు. దీంతో మూడు గంటలపాటు కార్యకర్తలు ఎండలో నిల్చోవల్సి వచ్చింది. దీంతో ఎండవేడిమిని తాళలేక సూరజ్‌ కుప్పకూలాడు. అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత సెప్టెంబరు 27న కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన రోడ్డు షోలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోగా, వంద మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

తమిళనాడు ఎన్నికల్లో గానీ, తర్వాత గానీ ‘ఇండియా’, ఎన్డీఏ కూటములతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని విజయ్‌ స్పష్టం చేశారు. ఓ ఆంగ్ల చానల్‌ నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇతర పార్టీల ర్యాలీలకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం.. టీవీకేకు మాత్రం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.

Updated Date - Feb 14 , 2026 | 02:30 AM