ఆధార్‌ను కేవలం గుర్తింపునకే పరిగణించాలి
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:54 AM
ఆధార్‌ను కేవలం గుర్తింపునకు ధ్రువపత్రంగానే తప్ప పౌరసత్వానికి, నివాసానికి, చిరునామాకు, జన్మ దినానికి రుజువుగా పరిగణించరాదని దాఖలైన పిటిషన్‌ను...
పౌరసత్వం, నివాస, జన్మ దిన రుజువుగా వద్దని పిటిషన్
కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ఆధార్‌ను కేవలం గుర్తింపునకు ధ్రువపత్రంగానే తప్ప పౌరసత్వానికి, నివాసానికి, చిరునామాకు, జన్మ దినానికి రుజువుగా పరిగణించరాదని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏవీ మోహన్ ఈమేరకు నోటీసులు జారీ చేశారు. ఆధార్ పౌరసత్వానికి, నివాస స్థలానికి రుజువుగా పరిగణించకూడదని ఆధార్ చట్టం సెక్షన్ 9లోనే ఉందని పిటిషనర్ గుర్తు చేశారు. ఆధార్ గుర్తింపునకు రుజువే కాని పౌరసత్వానికి కాదని 2023 ఆగస్టు 22న యూఐడీఏఐ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. కొత్త ఓటర్ నమోదుకు, జన్మదినం, నివాసస్థలానికి రుజువుగా ఆధార్‌ను చూపిస్తున్నారని, అలా చూపించకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారు అద్దె ఒప్పందాలు, అధికారుల సిఫారసుల ద్వారా ఆధార్‌ను సంపాదించి దాని ద్వారా పౌరసత్వాన్ని, ఓటర్ గుర్తింపు కార్డులను పొందుతున్నారని తెలిపారు.