24 గంటల పర్యటన... 15వేల మంది బలగాలు!
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:49 AM
బ్రిక్స్ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఢిల్లీకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు వేలాది మంది బలగాలతో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేసింది. జిన్‌పింగ్ బస చేసిన తాజ్ ప్యాలెస్ హోటల్‌ను నో-ఫ్లై జోన్‌గా ప్రకటించారు.
జిన్‌పింగ్‌కు అసాధారణ భద్రత ఏర్పాట్లు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: బ్రిక్స్ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఢిల్లీకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు వేలాది మంది బలగాలతో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేసింది. జిన్‌పింగ్ బస చేసిన తాజ్ ప్యాలెస్ హోటల్‌ను నో-ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఆయన ప్రయాణించే మార్గాలు, సదస్సు వేదిక వద్ద పోలీసులతో పాటు కేంద్ర పారామిలటరీ బలగాలు, ఉగ్రవాద నిరోధక దళాలు, బాంబ్ స్క్వాడ్‌లను మోహరించారు. జీవ-రసాయన, రేడియో ధార్మిక, అణు ముప్పులను గుర్తించే దిశగా ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. హోటల్‌కు సంబంధించిన అండర్ గ్రౌండ్ పైప్‌లైన్లను సైతం క్షుణ్నంగా పరిశీలించారు. ఆదివారం ఉదయం 11గంటలకు జిన్‌పింగ్ చైనాకు తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, విదేశీ ప్రతినిధుల రాకతో ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 15వేల మంది సిబ్బందితో పాటు 200 కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శాంతి పథ్ వరకూ 700కు పైగా సీసీటీవీ కెమెరాలు, ఐదు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.