Share News

బెంగాల్లో 91 లక్షల ఓట్లు అవుట్‌!

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:56 AM

పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(సర్‌) ప్రక్రియలో భాగంగా న్యాయాధికారుల స్ర్కూటినీ తర్వాత సుమారు 91 లక్షల ఓట్లను తొలగించారు.

బెంగాల్లో 91 లక్షల ఓట్లు అవుట్‌!

  • ఈసీ ‘సర్‌’ తాజా డేటాలో వివరాలు.. ముర్షీదాబాద్‌లో అత్యధికంగా 4.55 లక్షల ఓట్ల తొలగింపు

కోల్‌కతా/న్యూఢల్లీ, ఏప్రిల్‌ 7: పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(సర్‌) ప్రక్రియలో భాగంగా న్యాయాధికారుల స్ర్కూటినీ తర్వాత సుమారు 91 లక్షల ఓట్లను తొలగించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా.. దాని డేటా ఇదే విషయం చెబుతోంది. గత ఏడాది అక్టోబరు చివరి నాటికి రాష్ట్రంలో 7.66 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ‘సర్‌’ ప్రారంభమైన తర్వాత ఇప్పటికి 90.83 లక్షల మంది ఓటర్లను తొలగించారు. 60.06 లక్షల ఓటర్లను సందేహాస్పద, పెండింగ్‌లో జాబితాలో చేర్చగా.. న్యాయాధికారుల పరిశీలన తర్వాత 27.16 లక్షల ఓట్లను తీసివేశారు. మిగతా 32.68 లక్షల ఓట్లు చెల్లుబాటవుతాయని ప్రకటించి జాబితాల్లో పేర్లు పునరుద్ధరించారు. ఇప్పుడు 27.16 లక్షల మంది ఓటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరు అప్పిలేట్‌ ట్రైబ్యునళ్ల ముందు అప్పీల్‌ చేసుకున్నారు. కానీ ఈ నెల 23న తొలిదశ పోలింగ్‌ జరిగే 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాల్లో ఇక మార్పుచేర్పులకు అవకాశం లేదు. ఎందుకంటే సోమవారంతోనే నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. నామినేషన్లు పూర్తయిన తర్వాత ఓటర్ల జాబితాను ప్రచురించరాదు. మిగతా 142 నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు గడువు గురువారం సాయంత్రం 3 గంటలకు ముగియనుంది(వీటికి ఈ నెల 29న రెండో దశలో పోలింగ్‌ జరుగనుంది). ఈ నేపథ్యంలో అప్పిలేట్‌ ట్రైబ్యునళ్లు న్యాయనిర్ణయం చేసి.. కొన్ని ఓట్లను అర్హమైనవిగా గుర్తించినా.. సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలిస్తే తప్ప.. ఓటర్ల జాబితాల్లో ఆ పేర్లను చేర్చడానికి అవకాశం లేదని ఈసీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై టీఎంసీ నాయకురాలు, సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మతువా, రాజ్‌బంశీ, ఇతర మైనారిటీల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని మంగళవారం నాదియా జిల్లాలో జరిగిన ఓ ఎన్నికల సభలో ఆరోపించారు. మైనారిటీ జనాభా ఎక్కువగా ఉన్న ముర్షీదాబాద్‌, మాల్దా, ఉత్తర దీనాజ్‌పూర్‌ జిల్లాల్లో కొన్ని వర్గాల ఓట్లను ఎంచుకుని మరీ తొలగించారని ధ్వజమెత్తారు. తాను సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాతే సందేహాస్పద జాబితాలో పెట్టిన 60 లక్షల ఓట్లలో 32 లక్షల ఓట్లను పునరుద్ధరించారని చెప్పుకొచ్చారు. మరోవైపు, ప్రజల్లో భయాందోళనలను నెలకొల్పేందుకు మమత ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఈసీ తుది డేటా ప్రకారం.. ముస్లిం ప్రాబల్య జిల్లా అయిన ముర్షీదాబాద్‌లో అత్యధికంగా 11.01 లక్షల పేర్లు జ్యుడీషియల్‌ స్ర్కూటినీకి పంపగా.. వీటిలో 4.55 లక్షల ఓట్లను న్యాయాధికారుల పరిశీలన తర్వాత తొలగించారు. బంగ్లాదేశ్‌ సరిహద్దు జిల్లా అయిన ఉత్తర 24 పరగణాల జిల్లాలో 3.25 లక్షల ఓట్లు.. మాల్దాలో 2.39 లక్షలు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 2.23 లక్షలు, పూర్వ వర్ధమాన్‌ జిల్లాలో 2.09 లక్షలు, నాదియా జిల్లాలో 2.98 లక్షల ఓట్లను తీసివేశారు. నాదియా, ఉత్తర 24పరగణాల జిల్లాల్లో మతువా వర్గీయుల జనాభా ఎక్కువ. ఈ రెండు జిల్లాల్లో వరుసగా 78ు, 55ు ఓట్లను జ్యుడీషియల్‌ స్ర్కూటినీకి పంపారు.


మే 4 తర్వాత మిగతా రాష్ట్రాల్లోనూ ‘సర్‌’

ఈ నెలాఖరుకు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మిగిలిన 17 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం మూడో దశ సర్‌ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ తుది దశ లిస్టులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌, హరియాణా, అస్సాం సహా పలు ఇతర రాష్ట్రాలు, యూటీలు ఉంటాయని అధికారులు తెలిపారు. కేరళం, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే ఈ నెల 29వ తేదీ తర్వాత లేదా ఫలితాలు వెలువడే మే 4 తర్వాత మిగతా రాష్ట్రాల్లో భారీఎత్తున ‘సర్‌‘ ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు 10 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.

Updated Date - Apr 08 , 2026 | 03:56 AM