డిసెంబరు మొదటి వారంలో పార్లమెంటు!
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:24 AM
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశాల్లోనే నియోజకవర్గాల పెంపుతో లింకున్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలని..
ఈ శీతాకాల సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు
మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లతో లోక్‌సభ స్థానాల సంఖ్య 850కి పెంపు
అన్ని రాష్ట్రాల అసెంబ్లీల సంఖ్యాబలం కూడా..
న్యూఢిల్లీ, నవంబరు 15: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశాల్లోనే నియోజకవర్గాల పెంపుతో లింకున్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలని మోదీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. అలాగే ఉభయసభల నిర్వహణ తేదీలపై అత్యున్నత స్థాయిలో కసరత్తు జరుగుతోందని వెల్లడించాయి. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం.. ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 850కి పెంచి మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ను అమలు చేస్తారు. రాష్ట్రాల అసెంబ్లీల సంఖ్యాబలాన్ని కూడా పెంచి మహిళా రిజర్వేషన్ అమలుతో 2029లో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేదఫా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇంత మద్దతు పొందలేకపోవడంతో గత ఏప్రిల్‌లో ఈ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. అదీగాక.. సార్వత్రిక ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (సర్)ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాలకు, ప్రభుత్వానికి నడుమ ఘర్షణ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లు ఎంతవరకు ఆమోదం పొందుతుందన్నదానిపై అనుమానాలు నెలకొన్నాయి. 543 మంది సభ్యుల లోక్‌సభలో 361 మంది ఎంపీలు మద్దతివ్వాలి. సభలో ఇప్పుడు మూడు ఖాళీలున్నాయి. 540 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు.
ఎన్డీఏకి 320 మంది సభ్యుల బలముంది. ఇండీ కూటమి పార్టీల మద్దతు తప్పనిసరి. అయితే డీఎంకే, శివసేన-యూబీటీ, ఎన్సీపీ-ఎస్పీతో పాటు మరికొన్ని చిన్న పార్టీల మద్దతు సాధించి పార్లమెంటులో బిల్లుకు ఆమోదం పొందాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కనబడుతోంది. 15 నుంచి 18 ఓట్ల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందే అవకాశాలున్నాయని సీనియర్ మంత్రి ఒకరు నమ్మకంగా చెప్పారు. సర్‌పై ఆందోళనలతో వర్షాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో పార్లమెంటు అసలు సజావుగా నడుస్తుందనేది ప్రశ్న. కాగా.. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదాపడ్డాయి. 94 రోజులు దాటినా ఇంతవరకు వాటిని ప్రొరోగ్ చేయలేదు. 2008లో కూడా యూపీఏ హయాంలో 87 రోజులపాటు ప్రొరోగ్ చేయకుండా ఆపారు. మోదీ ప్రభుత్వం దీనిని దాటేసింది. పునర్విభజన బిల్లును తక్కువ సమయంలో ఆమోదింపజేసుకోవాలంటే.. ప్రొరోగ్ చేయకుండా ఉంటే.. సమావేశాల ఏర్పాటుకు రెండ్రోజులు నోటీసిస్తే సరిపోతుంది. అదే కొత్తగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేయాలంటే రెండు వారాల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. శీతాకాల సమావేశాలను డిసెంబరు మొదటి వారంలో ప్రారంభించాలనుకుంటే.. ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.