పేపర్ మీదే పేదలు!
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:11 AM
సమాజంలో ఇతర ఏ రిజర్వేషన్ ఫలాలూ అందని,ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని వారికి మేలు చేసే సంకల్పంతో తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గాడి తప్పుతోంది.
వాస్తవంలో ఉన్నతులు
పేదల కోటాలో యూపీఎస్‌సీ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు
కార్పొరేట్ స్కూళ్లలో చదువులు
లక్షలు పోసి అకాడమీల్లో శిక్షణ
కుటుంబ పెద్దలకు వ్యాపారాలు
అయినా.. తాము పేదలమంటూ లబ్ధి పొందిన 84 మంది క్యాండెట్లు
ఈడబ్ల్యూఎస్ ఎంపికపై సందేహాలు
పరిశీలనలో సంచలన విషయాలు
న్యూఢిల్లీ, జూన్ 20: సమాజంలో ఇతర ఏ రిజర్వేషన్ ఫలాలూ అందని,ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని వారికి మేలు చేసే సంకల్పంతో తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గాడి తప్పుతోంది. అఖిల భారత సర్వీసులకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ).. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ కింద ఎంపిక చేసిన అభ్యర్థుల వ్యవహారం వివాదానికి దారితీసింది. పేద కుటుంబాలకు చెందిన వారిగా పేర్కొంటూ రిజర్వేషన్ ఫలాలు అందుకున్న వారిలో మెజారిటీ అభ్యర్థులు ఉన్నతస్థాయి కుటుంబాలకు చెందిన వారని, ఆర్థికంగా బలంగానే ఉన్నారని ఓ పరిశీలనలో తేలింది. యూపీఎస్‌సీ-2025లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎంపికైన అభ్యర్థులు కార్పొరేట్ స్కూళ్లలో తమ విద్యను పూర్తిచేయడంతోపాటు రూ.లక్షలు వెచ్చింది కోచింగ్ తీసుకున్నట్టు వెల్లడైంది. అంతేకాదు.. ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నత స్థాయి వ్యాపార కుటుంబాలకు చెందిన వారని గుర్తించారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పరిశీలన నివేదిక ప్రకారం.. ఈడబ్ల్యూఎస్ కోటాలో 104 మంది అభ్యర్థుల్లో 84 మంది రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకున్నారు. ఇక, ఎంపికైన అభ్యర్థుల్లో కేవలం కొందరు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు అర్హులుగా ఉన్నారు. దీంతో ఈడబ్ల్యూఎస్ కోటా వాస్తవ లబ్ధిదారులకే అందుతోందా? అనే సందేహాలు తెరమీదికి వచ్చాయి. యూపీఎస్‌సీ-2025లో మొత్తం 958 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 104 మంది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాలు దక్కించుకున్నారు. తాజా పరిశీలనలో వీరిలో 84 మంది ఉన్నతస్థాయిలో ఉన్నట్టు తేలింది. కేవలం 29 మంది మాత్రమే వ్యవసాయ కుటుంబాలకు చెందినవారని తెలిసింది. కాగా, ఈ వ్యవహారంపై మాజీ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ సత్యానంద మిశ్రా తీవ్రంగా స్పందించారు. ‘‘కేవలం అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లకే పరిమితం కావడం సరికాదు. ఐటీ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఆదాయ, వ్యయాలు.. కుటుంబ నేపథ్యాన్ని నిశితంగా పరిశీలించాలి. లేక పోతే ఈడబ్ల్యూఎస్ లక్ష్యమే కొడిగడుతుంది.’’ అని వ్యాఖ్యానించారు.
లక్ష్యం ఉన్నతం!
దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో కేంద్రం చట్టం చేసింది. ఇతర ఏ రిజర్వేషన్లు దక్కని వారికి దీనిని అమలు చేయాలన్నది ఉన్నతస్థాయి లక్ష్యం. ఈ కోటా కింద లబ్ధిపొందేవారి కుటుంబాల ఆదాయం.. ఏటా రూ.8 లక్షలకు మించరాదు. వీరికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే స్థిరాస్తుల విషయంలోనూ కొన్ని పరిమితులు ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకునే ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తారు.
ఆశ్చర్యపరిచే అంశాలు..
ఈడబ్ల్యూఎస్ కోటాలో 104 మంది ఎంపికైతే.. వీరిలో 84 మంది కార్పొరేట్ తరహా శిక్షణ తీసుకున్నారు. వీరిలో 67 మంది ఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో అత్యంత ఖరీదైన సంస్థల్లో శిక్షణ పొందారు. ఈ సంస్థల్లో కోచింగ్ ఫీజు రూ.లక్షల్లోనే ఉంది.
46 మంది అభ్యర్థులు ఢిల్లీ సహా రాష్ట్రాల రాజధానుల్లోని ప్రైవేటు స్కూళ్లలోనే తమ చదువును పూర్తి చేశారు. ఆయా సంస్థల్లో వార్షిక ఫీజులు రూ.45 వేల నుంచి 1.5 లక్షల వరకు ఉన్నాయి.
28 మంది ఎంపికైన అభ్యర్థుల కుటుంబాలు వస్త్ర, ఐరన్ సహా ప్రముఖ వ్యాపారాలు చేస్తున్నాయి.
10 మంది అభ్యర్థులు యూపీఎస్‌సీకి ఎంపిక కాకముందు సాఫ్ట్‌వేర్, నిర్మాణ రంగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేశారు.
14 మంది అభ్యర్థులు ఐఐటీల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.
ముగ్గురు అభ్యర్థులు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు.