ఉసురు తీసిన సముద్రపు చిప్పలు
ABN , Publish Date - May 25 , 2026 | 05:49 AM
నదిలో లభించే సముద్రపు చిప్పల(శంకు, గవ్వలాంటివి) కోసం వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు.
నదిలో సేకరణకు వెళ్లి 8 మంది మృతి
ఉత్తరకన్నడ జిల్లాలో ప్రమాదం
బెంగళూరు, మే 24(ఆంధ్రజ్యోతి): నదిలో లభించే సముద్రపు చిప్పల(శంకు, గవ్వలాంటివి) కోసం వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ఉత్తరకన్నడ జిల్లా భట్కళ్ తాలూకా వెంకటాపుర నదిలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. శనివారం ఉత్తర కన్నడ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో నదిలో నీటిమట్టం పెరిగింది. చిప్పల కోసం 14మంది వెంకటాపుర నదికి వెళ్లారు. ఒకరికొకరు చేతులు పట్టుకుని నదిలోకి దిగారు. కాళ్లకు తగిలే చిప్పలను సేకరిస్తూ ముందుకెళ్లారు. ఈసందర్భంలో నీటి ప్రవాహం పెరిగి ముందుగా ఇద్దరు నీట మునగగా.. ఒకరికొకరు చేతులు పట్టుకోవడంతో మిగిలినవారు కూడా గల్లంతయ్యారు. మధ్యాహ్నానికి 8మంది మృతదేహాలు ఆళ్వకోడి వద్ద బయటపడ్డాయి. పడుశిరాలిబంగ్రె నివాసి లక్ష్మీమహదేవ నాయక (42), శారదాహొళెకి చెందిన ఉమేశ్ నాయక (30), లక్ష్మీనాయక (30), లక్ష్మీ అణ్ణప్పనాయక (60), లక్ష్మీ శివరామనాయక (49), జ్యోతినాగప్ప నాయక (34), మాలతినాయక (38), మాస్తమ్మనాయక మృతిచెందిన వారిలో ఉన్నట్టు భట్కళ్ పోలీసులు తెలిపారు. నాగరత్న, మహాదేవి ప్రాణాలతో బయటపడ్డారు. వారిని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మరో నలుగురి ఆచూకీ, వివరాలు తెలియరాలేదు. కాగా, కర్ణాటకలో నదిలో మునిగి ఎనిమిది మృతిచెందిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. నదిలో మునిగి ఎనిమిది మంది మరణించడం పట్ల ముఖ్యమంత్రి సిద్దరామయ్య దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.