ఏడేళ్ల పాప.. ఒంటికాలితో గెంతుతూ బడికి!
ABN , Publish Date - Sep 04 , 2026 | 06:25 AM
ఏడేళ్ల వయసున్న ఓ పాప ఒంటికాలితో గెంతుతోంది. యూపీలోని బలియా జిల్లా రాణీపూర్ గ్రామానికి చెందిన, ఒకటో తరగతి చదువుతున్న రాగిణి (7) అనే దివ్యాంగురాలిదీ గాథ! ఆరు నెలల వయసన్నప్పుడు ఓ ప్రమాదంలో రాగిణి కాలికి తీవ్రగాయమైంది.
6నెలల వయసులో ప్రమాదం.. పనికిరాకుండా పోయిన ఓ కాలు
ట్రై సైకిల్ ఇవ్వాలని పాప విజ్ఞప్తి..చికిత్స చేయిస్తామన్న యూపీ సీఎం
లఖ్‌నవూ, సెప్టెంబరు 3: ఏడేళ్ల వయసున్న ఓ పాప ఒంటికాలితో గెంతుతోంది. యూపీలోని బలియా జిల్లా రాణీపూర్ గ్రామానికి చెందిన, ఒకటో తరగతి చదువుతున్న రాగిణి (7) అనే దివ్యాంగురాలిదీ గాథ! ఆరు నెలల వయసన్నప్పుడు ఓ ప్రమాదంలో రాగిణి కాలికి తీవ్రగాయమైంది. ఆమె తండ్రి హైదరాబాద్‌లో కూలి పని చేస్తాడు. నిరుపేద కుటుంబం కావడంతో పాపకు తల్లిదండ్రులు సరైన వైద్యం చేయించలేకపోయారు.ఫలితంగా కాలు పనిచేయకుండా పోయింది. తన ఇంటి ముందు నుంచి రోజూ బడికి వెళ్లే తన ఈడు పిల్లలను చూసి రాగినిలోనూ చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఫలితంగా ఒంటికాలి నడకతోనే ఆమె నిత్యం బడికి వెళుతోంది. తాను బడికి వెళ్లొచ్చేందుకు ఓ ట్రై సైకిల్ ఇవ్వాలంటూ రాగిణి.. జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్న వీడియో ఒకటి నెట్‌లో వైరల్ అయింది. చివరికి రాగిని గాథ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లింది. పాప కాలికి చికిత్స చేయిస్తామని ప్రకటించారు. రాగిణి కాలికి చికిత్స అందించేందుకు ‘ఫిజిక్స్ వాలా’ కోచింగ్ సీఈవో అలఖ్ పాండే రూ.10లక్షలు అందజేశారు. జిల్లా కలెక్టర్ బాలిక కోసం ఓ ట్రై సైకిల్‌ను పంపారు.