Share News

గల్ఫ్‌ నుంచి 67 వేల మంది వెనక్కిపార్లమెంటులో విదేశాంగ మంత్రి జైశంకర్‌ వెల్లడి

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:05 AM

పశ్చిమాసియాలో పెరిగిపోతున్న ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. చర్చలు, దౌత్య సంప్రదింపులతోనే సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చిది.

గల్ఫ్‌ నుంచి 67 వేల మంది వెనక్కిపార్లమెంటులో విదేశాంగ మంత్రి జైశంకర్‌ వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 9: పశ్చిమాసియాలో పెరిగిపోతున్న ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. చర్చలు, దౌత్య సంప్రదింపులతోనే సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చిది. పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లో ఉన్న కోటి మంది భారతీయుల భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఫిబ్రవరి 28న ఇరాన్‌ సుప్రీం కమాండర్‌ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న పోరులో ఇప్పటి వరకు ఇరాన్‌లో 1230 మందికి పైగా మరణించగా.. లెబనాన్‌లో 397 మంది, ఇజ్రాయెల్‌లో 11 మంది మృత్యువాత పడ్డారు. పశ్చిమాసియాలో పరస్పర దాడులతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం సుమోటోగా ఒక ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ రాజ్యసభలో మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని వెల్లడించారు. జైశంకర్‌ ఈ ప్రకటన చేస్తున్న సమయంలో ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై పూర్తి స్థాయిలో చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. లోక్‌సభలో కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో సభ పదేపదే వాయిదా పడింది. పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన చేశారు. భారతదేశ ఇంధన భద్రతపై చర్చ జరగాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్‌ చేశారు. తీవ్ర గందరగోళం నడుమే జైశంకర్‌ మాట్లాడారు. పశ్చిమాసియాలోని పలు దేశాధినేతలతో ప్రధాని మాట్లాడారని, అక్కడ ఉన్న భారతీయు క్షేమ సమాచారంపై ఆరా తీశారని వెల్లడించారు. ‘‘పశ్చిమాసియాలో పరిణామాలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. మన ఇంధన భద్రతకు ఈ ప్రాంతం ఎంతో కీలకం. అక్కడినుంచే మన అవసరాలకు కావాల్సిన చమురు, గ్యాస్‌ వస్తోంది. లక్షలాదిమంది భారతీయులు గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వారి గురించే మా ఆందోళన. అక్కడ చిక్కుకొన్నవారిని తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని జైశంకర్‌ తెలిపారు. పశ్చిమాసియా దేశాల్లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారని, వారిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపుతోందన్నారు. యుద్ధం కొనసాగుతున్న ప్రాంతాల్లోని 67 వేల మంది భారతీయులను ఇప్పటికే స్వదేశానికి తీసుకొచ్చినట్లు వివరించారు.


ఇరాన్‌ నౌకలకు ఆశ్రయం ఇచ్చాం

విశాఖలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నౌక ఐరిస్‌ లావన్‌కు తిరుగుప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాన్ని కొచ్చి ఓడరేవులో నిలిపేందుకు అంగీకరించాలని ఇరాన్‌ కోరగా..భారత ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చింది. అలాగే మరో 3నౌకలను పోర్టుల్లో నిలిపేందుకు అనుమతి ఇవ్వాలని గత నెల 28న కోరగా.. మరుసటి రోజే అంగీకరించినట్లు జైశంకర్‌ తెలిపారు. గత వారం శ్రీలంక తీరంలో ఇరాన్‌ యుద్ధనౌక ‘ఐరి్‌స-దేనా’ను అమెరికా ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైశంకర్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. 3 నౌకల్లోని ఇరాన్‌ సిబ్బంది భారత పోర్టుల్లో ఆశ్రయం పొందారని తెలిపారు. కాగా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణంపై ఇప్పటికిప్పుడు పెద్దగా ప్రభావం పడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Updated Date - Mar 10 , 2026 | 05:05 AM