63.66 లక్షల ఓట్లు తొలగింపు
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:36 AM
ఓటర్ల సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ జాబితా నుంచి 63.66 లక్షల ఓట్లను తొలగించినట్లు ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి...
మరో 60 లక్షల ఓట్లపై న్యాయ పరిశీలన
బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ
కోల్‌కతా, ఫిబ్రవరి 28: ఓటర్ల సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ జాబితా నుంచి 63.66 లక్షల ఓట్లను తొలగించినట్లు ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) మనోజ్‌కుమార్ అగర్వాల్ శనివారం ప్రకటించారు. మరో 60.06 లక్షల ఓట్లకు సంబంధించి త్వరలో న్యాయపరమైన పరిశీలన చేపడుతామని వెల్లడించారు. గత ఏడాది నవంబరులో ప్రారంభమైన ఎస్‌ఐఆర్ ముగియటంతో శనివారం ఆయన మీడియా సమావేశంలో ఓటర్ జాబితా వివరాలు వెల్లడించారు. ఎస్‌ఐఆర్ చేపట్టడానికి ముందు రాష్ట్రంలో 7.66 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 7.04 కోట్లకు తగ్గినట్లు వివరించారు.
మమత నియోజకవర్గంలోనూ కోత
రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినే త్రిమమతాబెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 47 వేల ఓట్లను జాబితా నుంచి తొలగించారు. మరో 14వేల మంది పేర్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ మమత కంచుకోట. ఎస్‌ఐఆర్ ప్రక్రియ మొదలయ్యే సమయానికి ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2.06 లక్షల మంది. వీరిలో 44,786 మంది పేర్లు డిసెంబరు 16న ప్రచురించిన ముసాయిదా జాబితాలో లేవు. మరో 2,324 మంది పేర్లు తొలగిస్తూ, శనివారం తుది జాబితాను ఈసీ విడుదల చేసింది. అంటే.. మొత్తం 47 వేలమందిని తొలగించారన్న మాట. భవానీపూర్‌లో మమతకు గత ఎన్నికల్లో 58 వేల ఓట్ల ఆధిక్యత లభించడం గమనార్హం.
మోగనున్న భేరి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మార్చి రెండో వారంలో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మూడు విడతలుగా పోలింగ్ జరగొచ్చునని ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల సంఘం పూర్తి బృందం ఆదివారం కోల్‌కతాలో పర్యటించనున్నదన్న వార్తలను ఈ వర్గాలు ఖండించాయి. హోలీ తర్వాతే ఈ టీమ్ రాష్ట్రానికి రానున్నదని తెలిపాయి.