ఐదు కార్లుంటే అద్దె వ్యాపారం ప్రారంభించొచ్చు
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:51 AM
అద్దె కార్లను మరింత మందికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక ప్రతిపాదన చేసింది.
‘కార్ రెంటల్’పై కేంద్రం కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ, నవంబరు 12: అద్దె కార్లను మరింత మందికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక ప్రతిపాదన చేసింది. స్వయం చోదక, డ్రైవర్‌తో కూడిన అద్దె కార్ల (కార్ రెంటల్ )వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇప్పటి వరకు కనీసం 50 కార్లను కలిగి ఉండాలని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. దీన్ని ఐదు కార్లకు తగ్గించాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దీనివల్ల మరింత మంది వ్యాపారులు ఈ రంగంలోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం కానుంది. ఇందుకు సంబంధించి ‘ద రెంట్ ఏ క్యాబ్ స్కీమ్ 2026’ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. కార్యకలాపాలు నిర్వహించే ప్రతీ ప్రాంతంలో కనీసం రెండు కార్లను కలిగి ఉండాలి. మొత్తంగా ఐదు కార్లను కలిగి ఉండడం తప్పనిసరి. సమగ్ర బీమా పాలసీ కూడా తీసుకోవాలి. ఇందులో వాహనాన్ని అద్దెకు తీసుకునే వ్యక్తి, డ్రైవర్‌తోపాటు, ఇతర ప్రయాణికులకు బీమా రక్షణ ఉండాలి. మోటారు వాహన చట్టం పరిధిలో నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఎలాంటి పెండింగ్ చలాన్లు ఉండకూడదు. జనవరి నుంచి కొత్త నిబంధనలను అమలు చేయాలని కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా శాఖ భావిస్తోంది.