14 ఏళ్లకే శాట్‌లో ఫుల్ స్కోర్
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:45 AM
పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అతి కఠినమైన పరీక్షలో అతిచిన్న వయసులోనే నూటికి నూరుశాతం మార్కులు సాధించి ఔరా అనిపించాడు ఓ తెలుగు బాలుడు.
అమెరికాలో 1,600లకు 1,600
మార్కులు సాధించిన తెలుగు బాలుడు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అతి కఠినమైన పరీక్షలో అతిచిన్న వయసులోనే నూటికి నూరుశాతం మార్కులు సాధించి ఔరా అనిపించాడు ఓ తెలుగు బాలుడు. అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఫుల్టన్ కౌంటీలో ఉంటున్న ఆశ్రిత్ తాళ్లూరి అనే 14 ఏళ్ల బాలుడు స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే స్కోలాస్టిక్ అచీవ్‌మెంట్ టెస్ట్(శాట్)లో అతడు అద్భుతం చేశాడు. 11, 12వ తరగతుల విద్యార్థులు రాసే ఈ పరీక్షకు 9వ తరగతిలో ఉండగానే గత జూన్‌లో హాజరయ్యాడు. పరీక్షలో మొత్తం మార్కులు 1,600 కాగా, అతడు 1,600 సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పరీక్ష కోసం 5నెలలపాటు సిద్ధమైనట్లు ఆశ్రిత్ తెలిపాడు. గతంలోనూ ఇతడు పలు ఘనతలు సాధించాడు. మిడిల్ స్కూల్‌లో ఉండగానే 14.5 హైస్కూల్ స్థాయి క్రెడిట్స్ సాధించి ప్రతిష్ఠాత్మక హార్వర్డ్, రైస్ యూనివర్సిటీల్లో కాలేజీ లెవెల్ సమ్మర్ ప్రోగ్రామ్‌లకు ఎంపికయ్యాడు. భవిష్యత్‌లో న్యూరోసర్జన్ అవుతానని ఆశ్రిత్ తెలిపాడు.
ఈ వార్తలు కూడా చదవండి
రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు
ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?