డిగ్రీలున్నా 40శాతం మందికి దక్కని కొలువు
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:17 AM
పట్టభద్రులైన యువతకు దేశంలో ఉద్యోగాల వేట పెనుసవాలుగా మారింది. భారత్‌లో 40శాతం మంది గ్రాడ్యుయేట్లు సరైన ఉపాధి పొందలేకపోతున్నారని అజీజ్ ప్రేమ్‌జీ వర్సిటీ విడుదల.....
ఏటా 50లక్షల మంది గ్రాడ్యుయేట్లు..28లక్షల మందికే ఉపాధి!
న్యూఢిల్లీ, మార్చి 17: పట్టభద్రులైన యువతకు దేశంలో ఉద్యోగాల వేట పెనుసవాలుగా మారింది. భారత్‌లో 40శాతం మంది గ్రాడ్యుయేట్లు సరైన ఉపాధి పొందలేకపోతున్నారని అజీజ్ ప్రేమ్‌జీ వర్సిటీ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా డిగ్రీ పూర్తయిన ఏడాదిలోపు స్థిరమైన జీతం గల ఉద్యోగం సంపాదించేవారు 7ు మాత్రమే ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా 20 నుంచి 29ఏళ్ల మధ్య వయసున్న 6.3కోట్ల మంది గ్రాడ్యుయేట్లలో సుమారు 1.1కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా ఉన్నత విద్యలో చేరేవారి సంఖ్య పెరిగినప్పటికీ, అందుకు తగిన స్థాయిలో కొత్త ఉద్యోగాల సృష్టి జరగకపోవడం ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే చదువు ఆపేస్తున్న వారిసంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. 2017లో డ్రాపవుట్లు 58శాతం ఉండగా, 2023నాటికి అది 72 శాతానికి చేరడం గమనార్హం. 2004నుంచి ఏటా సగటున 50లక్షల మంది కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నా.. వీరిలో 28లక్షల మందికి మాత్రమే ఏదో ఒక రూపంలో ఉపాధి లభిస్తోంది. మిగిలిన 22లక్షల మంది పట్టభద్రులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు.