నలభైలో తొలి గంట అరవైలో మలిగంట!
ABN , Publish Date - Nov 23 , 2026 | 02:25 AM
మనిషికి వయసు మీదపడుతోందని ఎప్పుడు తెలుస్తుంది? వృద్ధాప్యం ఎప్పుడు మొదలువుతుంది? జుట్టు నెరవడం మొదలైనప్పుడా.. మోకాళ్లు మొరయించినప్పుడా..
వృద్ధాప్యం వైపు మనిషి పయనంలో ఈ రెండు సమయాల్లో ఒక్కసారిగా మార్పులు
హఠాత్తుగా తగ్గుతున్న సీడీ-4,8 కణాల సామర్థ్యం
పురుషుల కంటే మహిళల్లో కాస్త లేటు ‘మలుపు’
రోగ నిరోధక వ్యవస్థలోని కణాలపై పరిశోధనలో గుర్తించిన సింగపూర్ శాస్త్రవేత్తలు
(సెంట్రల్ డెస్క్)
మనిషికి వయసు మీదపడుతోందని ఎప్పుడు తెలుస్తుంది? వృద్ధాప్యం ఎప్పుడు మొదలువుతుంది? జుట్టు నెరవడం మొదలైనప్పుడా.. మోకాళ్లు మొరయించినప్పుడా.. అద్దంలో ముఖం కొత్తగా కనిపిస్తున్నప్పుడా.. చిన్న పనికే అలసట అనిపించడమో, ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడమో మొదలైనప్పుడా.. వీటన్నింటికీ భిన్నంగా మనకు వయసు మీదపడుతోందని చెప్పడానికి, వృద్ధాప్యానికి రెండు కీలక మలుపులు ఉన్నాయంటోందని తాజా పరిశోధన. కాలం గడిచిన కొద్దీ మెల్లమెల్లగా వృద్ధాప్యం దరిచేరడం, వయసు ప్రభావాలు, శరీరంలో అంతర్గత మార్పులు జరగడం సాధారణమే అయినా... 40 ఏళ్ల వయసులో ఒకసారి, 60 ఏళ్ల సమయంలో మరోసారి ఒక్కసారిగా కీలకమైన మార్పులు జరుగుతున్నాయని పరిశోధకులు తేల్చారు. నేచర్ కమ్యూనికేషన్ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.
18 వందల మందిపై అధ్యయనం
సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు.. 19 నుంచి 97 ఏళ్ల మధ్య వయసున్న 1,828 మంది ఆరోగ్యవంతుల రక్తంలోని రోగనిరోధక కణాలను విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, వివిధ జాతులకు చెందినవారూ ఇందులో ఉన్నారు. మొత్తం 1,828 మందికి సంబంధించి రక్తంలోని 38 లక్షల రోగనిరోధక కణాలను, వాటి జన్యువులను పోల్చి చూశారు. ఏయే కణాలు, వాటిలోని జన్యువులు ఏ వయసులో ఎంత చురుగ్గా పనిచేస్తున్నాయో విశ్లేషించారు. ఈ క్రమంలో రెండు దశల్లో రోగనిరోధక కణాల్లోని జన్యు కార్యకలాపాల్లో గణనీయమైన మార్పులను గుర్తించారు. ఒకటి 40 ఏళ్ల సమీపంలోకాగా, మరొకటి 60 ఏళ్లు దాటాక జరిగాయని.. వయసుతోపాటు శరీరంలో జరిగే మార్పులు ఒకే వేగంతో సాగడం లేదని తేల్చారు.
40 ఏళ్ల సమయంలో ఒక టీమ్.. 60 ఏళ్ల తర్వాత మరో టీమ్
మన రోగనిరోధక వ్యవస్థలో టీ-కణాలది కీలక పాత్ర. శరీరంలోకి ప్రవేశించే వైర్‌సలు, బ్యాక్టీరియా వంటి శత్రువులను గుర్తించడం, వాటిపై దాడి చేయడం, ఇతర రక్షణ కణాలను సమన్వయం చేయడం వీటి బాధ్యత. వీటిలో ప్రధానమైన టీ-4, టీ-8 కణాల్లో వయసు మార్పుల లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. టీ-4 కణాలు రోగనిరోధక వ్యవస్థకు సమన్వయకర్తల్లాంటివి. ఇతర రక్షణ కణాలకు సూచనలిస్తూ, వైర్‌సలు, ఇతర సూక్ష్మజీవులపై దాడిని సమర్థంగా నడిపిస్తాయి. 40 ఏళ్ల వయసులో వీటి జన్యు కార్యకలాపాల్లో గణనీయంగా మార్పులు కనిపించాయి. ఇక వైరస్ సోకిన, అసాధారణంగా మారిన కణాలను నేరుగా నాశనం చేసే టీ-8 కణాల్లో 60 ఏళ్ల వయసు తర్వాత భారీగా మార్పులను గుర్తించారు. ఈ రెండు దశల్లో కూడా శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్)కు సంబంధించిన జన్యు కార్యకలాపాలు పెరిగాయి. అంటే శరీర రక్షణ వ్యవస్థలో కొన్ని పనులు మందగిస్తుండగా, మరికొన్ని అనవసరంగా చురుగ్గా మారుతున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన బయోమెడికల్ శాస్త్రవేత్త జాక్వెస్ బెహ్మోరాస్ తెలిపారు.
మహిళల్లో కాస్త ఆలస్యంగా మార్పులు..
ఇక మహిళల్లో 60 ఏళ్లు దాటినా సీడీ-8 కణాలు చురుకుగా ఉన్నట్టు గుర్తించామని, సీడీ-4, బీ, నేచురల్ కిల్లర్ కణాల్లో కూడా మార్పులు తక్కువ వేగంతో జరుగుతున్నాయని వివరించారు. అదే పురుషుల్లో మాత్రం 40 ఏళ్ల సమయంలోనే సీడీ కణాల్లో హెచ్చుతగ్గులు కనిపించాయని తెలిపారు. మహిళలు సగటున ఎక్కువకాలం జీవించడానికి, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు వారిలో ఎక్కువగా కనిపించడానికి ఇవి కారణం కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది పూర్తి ఆరోగ్యవంతులపై చేసిన పరిశోధన అని.. వ్యక్తుల ఆహారం, ఇతర అలవాట్లు, శారీరక శ్రమ, గుండె, మెదడు, కిడ్నీలు సహా కీలక అవయవాల ఆరోగ్యం వంటి అంశాలు వయసు మీదపడే మార్పులను ప్రభావితం చేస్తాయని స్పష్టం చేశారు. కొందరిలో రెండు, మూడేళ్ల ముందే మార్పులు కనిపిస్తే... మరికొందరిలో కొంత ఆలస్యంగా కనిపించవచ్చని తెలిపారు.