బళ్లారిలో రూ.350 కోట్ల జీఎస్టీ స్కాం
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:59 AM
ఆ యువకుడి పేరు రోషన్. బళ్లారిలోని ఓ కార్ల షో రూంలో సర్వీస్ అడ్వైజర్‌గా పనిచేస్తుంటాడు. నెల జీతం రూ.15 వేలు. అతని తండ్రి ఫకృద్దీన్ హమాలీ పని చేస్తుంటారు.
సర్వీస్ బాయ్ పేరిట నకిలీ కంపెనీ పెట్టి మోసం
బళ్లారి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆ యువకుడి పేరు రోషన్. బళ్లారిలోని ఓ కార్ల షో రూంలో సర్వీస్ అడ్వైజర్‌గా పనిచేస్తుంటాడు. నెల జీతం రూ.15 వేలు. అతని తండ్రి ఫకృద్దీన్ హమాలీ పని చేస్తుంటారు. యువకుడి తల్లి, చెల్లి ఇంటివద్ద పూలు కడుతుంటారు. చెమటోడ్చి జీవిస్తున్న ఈ ఇంటికి జీఎస్టీ అధికారులు వచ్చారు. ‘ఐదు నెలల్లో రూ.350 కోట్ల జీఎస్టీ కట్టారు. అలాంటిది కంపెనీని ఎందుకు మూసేస్తున్నారు..?’ అని ఆరాతీశారు. దీంతో ఆ కుటుంబం అవాక్కయింది. అసలు ఏమైందంటే.. రోషన్ పేరిట ఐదు నెలల కిందట ఎవరో జీఎస్టీ నెంబర్ తీసుకున్నారు. ప్లాస్టిక్ తయారీ కంపెనీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే ఏకంగా రూ.350 కోట్ల జీఎస్టీ చెల్లించారు. ఇటీవలే జీఎస్టీ నెంబర్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు సెంట్రల్ జీఎ్‌సటీ అధికారికి ఆన్‌లైన్‌లో సమాచారం అందింది. ఇంత మంచి కంపెనీ ఎందుకు జీఎస్టీ క్లోజ్ చేసుకుంటోందనని సెంట్రల్ జీఎస్టీ అధికారులు ఆరాతీశారు. కంపెనీ అడ్ర్‌సను వెతుక్కుంటూ బళ్లారిలోని రోషన్ ఇంటికి చేరారు. ‘రోషన్ ఎంటర్‌ప్రైజెస్ అనే పేరుతో ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్నట్లు కంపెనీ రిజిస్టర్ అయింది’ అంటూ ఇతర వివరాలను తెలిపారు. ఆశ్చర్యపోయిన రోషన్ కుటుంబసభ్యులు తమ ఇంట్లో ఎవరెవరు ఏయే పనులు చేస్తారో, తమ సంపాదన ఏమిటో అధికారులకు వివరించారు. రోషన్ పాన్‌కార్డు, ఆధార్ కార్డు, ఇంటి కరెంట్ బిల్లు సేకరించి ఎవరో భారీ కుంభకోణం చేశారని అధికారులకు అర్థమైంది. గతంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కోసం తన ఆధార్‌కార్డు, పాన్ కార్డు, ఇంటి కరెంటు బిల్లు ఇచ్చానని అధికారులకు రోషన్ వివరించారు. వాటి ఆధారంగా తన పేరుతో, నకిలీ కంపెనీ సృష్టించి ఉంటారని తెలిపారు. ఈ మోసంపై రోషన్ కుటుంబం బళ్లారి సైబర్ పోలీస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది.