Share News

జేపీఎస్సీలో ముగ్గురు సభ్యుల రాజీనామా

ABN , Publish Date - Aug 10 , 2026 | 05:06 AM

ఉద్యోగ పరీక్షల్లో అక్రమాలపై విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ముగ్గురు జార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(జేపీఎస్సీ) సభ్యులు ఆదివారం రాజీనామా చేశారు. జార్ఖండ్‌ గవర్నర్‌కి జేపీఎస్‌సీ సభ్యులు..

జేపీఎస్సీలో ముగ్గురు సభ్యుల రాజీనామా

  • విద్యార్థులకు న్యాయం చేస్తామన్న జార్ఖండ్‌ సీఎం సోరెన్‌

  • సీబీఐ విచారణకు విద్యార్థుల పట్టు.. నేడు అసెంబ్లీ మార్చ్‌

రాంచి, ఆగస్టు 9 : ఉద్యోగ పరీక్షల్లో అక్రమాలపై విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ముగ్గురు జార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(జేపీఎస్సీ) సభ్యులు ఆదివారం రాజీనామా చేశారు. జార్ఖండ్‌ గవర్నర్‌కి జేపీఎస్‌సీ సభ్యులు అజిత భట్టాచార్య, జమీల్‌ అహ్మద్‌, అనిమా హంస్దా రాజీనామా లేఖలు సమర్పించారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అక్రమాలపై జార్ఖండ్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వారితో జార్ఖండ్‌ ప్రభుత్వం ఆదివారం రెండు దఫాలు జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో జేపీఎస్‌సీ సభ్యులు రాజీనామాలు చేయడం గమనార్హం. మరోవైపు.. ఉద్యోగ పరీక్షల్లో అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రకటించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళనలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరి కాదన్నారు. కాగా, ఉద్యోగ పరీక్షల్లో అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినా ఆందోళన చేస్తున్న విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. సీబీఐ విచారణ జరపాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాల నేతలకు మధ్య తాజాగా ఆదివారం ఆరో విడత చర్చలు జరిగినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. సీబీఐ విచారణకు అంగీకరించే వరకు ఆందోళన విరమించేది లేదని, సోమవారం అసెంబ్లీ మార్చ్‌ నిర్వహిస్తామని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్‌ స్పష్టం చేశారు.

Updated Date - Aug 10 , 2026 | 05:09 AM